ఐపిఎల్ కు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు లింక్..? కెకెఆర్ గెలిచింది కాబట్టి ఆ పార్టీ ఓడుతుందట..!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితానికి లింక్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఓ వివాదాస్పద జ్యోతిష్యుడితో నెటిజన్లు ఆడుకుంటున్నారు.
అమరావతి : గత రెండు నెలల పాటు భారత ప్రజలకు క్రికెట్ మజాను అందించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024. ఈ మెగా టోర్నికి సమాతరంగానే ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సందడి కూడా సాగింది. అయితే ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి... తాజాగా ఐపిఎల్ టోర్నీ కూడా ముగిసింది. ఇలా ఐపిఎల్, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఒకే సమయంలో జరగ్గా... ఓ వివాదాస్పద జ్యోతిష్యుడు ఈ రెండిట్లో విజయం ఎవరిదో ముందుగానే చెప్పాడు. అయితే ఐపిఎల్ లో అతడి మాట తప్పడంతో ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూడా ఇలాగే జరుగుతుందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. సదరు జ్యోతిష్యుడితో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఐపిఎల్ రిజల్ట్ కు ఏపీ ఎలక్షన్ ఫలితలకు లింక్ పెడుతూ ఆ జ్యోతిష్యుడిని, అతడు గెలుస్తాడన్న పార్టీని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకూ ఆ జ్యోతిష్యుడు ఎవరు? ఐపిఎల్ గురించి ఏ మాట్లాడాడు? ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి ఏమన్నాడు? ఐపిఎల్ ఫైనల్ తర్వాత అతడు ఎంతలా ట్రోల్ అవుతున్నాడు? ఏపీ ఫలితాలపై అతడు చెప్పింది నిజం కాకుంటే ఇంకెంత ట్రోల్ అవుతాడో?....
ఇంతకీ ఎవరా జ్యోతిష్యుడు..:
వేణు స్వామి... ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న జ్యోతిష్యుడి పేరు. అతడు ఎవరి జాతకం చెప్పినా సంచలనమే... ఏం మాట్లాడినా వివాదాస్పదమే. ముఖ్యంగా సినిమా వాళ్ళ జాతకాలు చెప్పడం... వారితో విచిత్రమైన పూజలు చేయించడం ద్వారా వేణుస్వామి ఫేమస్ అయ్యాడు. ఇలా కేవలం సినిమాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు రాజకీయాలు, క్రీడల్లో కూడా తలదూరుస్తుంటాడు వేణుస్వామి. ఇలా తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మరియు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై జాతకం చెప్పాడు. ఇదే ఇప్పుడు ఆయనపై ట్రోల్స్ కు కారణమయ్యింది.
వేణుస్వామి ఏం చెప్పాడు... ఏం జరిగింది..:
ఈసారి ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. ఐపిఎల్ రికార్డులను బద్దలుగొడుతూ ఎస్‌ఆర్‌హెచ్ మంచి ఫామ్ తో దూసుకుపోతున్న సమయంలో అందరికీ ఈ జట్టుపై అంచనాలు పెరిగిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో జ్యోతిష్యుడు వేణుస్వామి ఎంట్రీ ఇచ్చాడు. సన్ రైజర్స్ టీం యజమాని కావ్య మారన్ జాతకం అద్భుతంగా వుంది... కాబట్టి ఈసారి ఐపిఎల్ ట్రోపీ ఆ జట్టే ఎగరేసుకు పోతుందంటూ జాతకం చెప్పాడు. కానీ ఆయన జాతకం కాస్త తారుమారయ్యింది... నిన్న(ఆదివారం) జరిగిన ఐపిఎల్ ఫైనల్లో హైదరాబాద్ టీం చిత్తుగా ఓడిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఐపిఎల్ 2024 విజేతగా నిలిచి టైటిల్ ను ముద్దాడింది.
ఇలా ఐపిఎల్ ఫలితం తర్వాత వేణుస్వామి తీవ్ర ట్రోలింగ్ కు గురవుతున్నాడు. తాజా ఐపిఎల్ ఫలితాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ పై వేణుస్వామి చేసిన కామెంట్స్ తో లింక్ చేస్తున్నారు... అతడు చెప్పిందేదీ నిజం కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఓ పార్టీ అనుకూల నెటిజన్లు. వేణుస్వామి చెప్పిందేదీ నిజం కాదని ... ఐపిఎల్ ఫలితంలాగే ఏపీ ఎన్నికల్లోనూ అతడు చెప్పిందానికి వ్యతిరేకంగా జరుగుతుందని ఎద్దేవా చేస్తున్నారు.
ఇంతకూ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలపై వేణుస్వామి ఏమన్నాడంటే..!!
ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు ముగిసాయి. వైసిపి ఒంటరిగానే బరిలో దిగితే ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి లు కూటమిగా ఏర్పడి పోటీ చేసాయి. ఇటీవలే ఏపీలో పోలింగ్ కూడా ముగిసింది. అయితే ఈసారి కూటమికే గెలిచే అవకాశాలున్నాయిని కొన్ని, మళ్లీ వైసిపిదే విజయమని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే వేణుస్వామి మాత్రం ఈసారి ఖచ్చితంగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని... వైసిపి ప్రభుత్వమే ఏర్పడుతుందని అంటున్నారు. వైఎస్ జగన్ జాతకంలో బుధ మహాదశ ప్రవేశించింది... కాబట్టి ఆయనను మరో 17 ఏళ్ళు ఎవరూ ఎదిరించలేరని అంటున్నారు. అంటే కేవలం 2024 లోనే కాదు మరో ఐదేళ్ల తర్వాత 2029 లో జరిగే ఎన్నికల్లోనూ వైసిపిదే విజయమని వేణుస్వామి చెబుతున్నారు.
ఇలా వైఎస్ జగన్ ను ఆకాశానికెత్తుతూ ఇక టిడిపి పని అయిపోయింది... ఆ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం అనేలా వేణుస్వామి మాట్లాడుతున్నారు. ఈ మాటలు టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇలా వీరంతా వేణుస్వామి ఎక్కడ దొరుకుతాడని ఎదురుచూస్తుండగా ఐపిఎల్ లో దొరికిపోయాడు. ఐపిఎల్ విజేతపై అతడు చెప్పింది తలకిందులయ్యింది... దీంతో వేణుస్వామిపై టిడిపి అనుకూల సోషల్ మీడియా విభాగాల్లో తెగ ట్రోలింగ్ సాగుతోంది. చివరకు తెలుగుదేశం పార్టీ కూడా అధికారిక ఎక్స్ ఖాతాలో వేణుస్వామికి చురకలు అంటిస్తూ ట్వీట్ చేసింది.