అనంతపురంలో ఓ వ్యక్తి వితంతువును లైంగిక వేధింపులకు గురిచేశాడు. కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. ఒప్పుకోకపోతే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

అనంతపురం : ఒక వితంతువుపై ట్రాన్స్ కో ఉద్యోగి కన్నేశాడు. తన కోరిక తీరిస్తే కుటుంబానికి అండగా ఉంటానంటూ వెంటపడుతున్నాడు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తే లేదని ఆమె తెలియచెప్పింది. అయినా ఆ ఉద్యోగి వేధింపులు ఆపడం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను అనంతపురం టౌన్ సీఐ రాఘవన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

శారద నగర్ లో ఉంటున్న ఓ మహిళ భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. భర్త మరణానంతరం కుటుంబ భారం ఆమెపై పడింది. అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్ల వద్దకు వెళ్ళి.. వారికి సపర్యలు చేసి.. వచ్చే సంపాదనతో పిల్లలను పోషించుకుంటోంది. నడిమివంక ప్రాంతంలో నివాసం ఉంటున్న వితంతువు తల్లికి నాలుగో రోడ్డులో నివాసముంటున్న ట్రాన్స్కో కార్యాలయం అటెండర్ అబ్దుల్ నబీసాబ్ పరిచయం ఉంది. అలా అన్ని విషయాలు తెలుసుకున్న ఇతడు వితంతుపై మోజు పడ్డాడు.

ప్రకాశం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం, ఒకరి మీద దాడి.. భయాందోళనలో ప్రజలు..

తన కోరిక తీరిస్తే ఆమె కుటుంబ బాగోగులు చూసుకుంటానని నమ్మబలికాడు. ఇందుకు వితంతువును ఒప్పించే విషయంలో తల్లి కూడా ఒత్తిడి తీసుకు వచ్చింది. అయితే ఇందుకు వితంతువు ససేమిరా ఒప్పుకోలేదు. నెల రోజుల క్రితం అబ్దుల్ నబీసాబ్ వితంతువు ఇంటికి వెళ్లి ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టాడు. ఆమె ఈసారి ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇళ్ళల్లో పని చేసుకునైనా పిల్లలను పోషించుకుంటాను తప్పా.. నీలాంటి వాడితో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

మరోసారి వెంటపడి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. మళ్లీ వేధింపులకు దిగుతుండడంతో వితంతువు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రాఘవన్ కు ఫిర్యాదు చేసింది. సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ అల్లా బకాష్ విచారణ చేపట్టిన తర్వాత ట్రాన్స్కో ఉద్యోగి అబ్దుల్ నబీసాబ్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వితంతువు తల్లి పైనా కేసులు నమోదు చేశారు. 

కాగా, వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో యూత్ క్రికెట్ క్లబ్ లో శిక్షణ పొందుతున్న 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు యూత్ క్రికెట్ క్లబ్, కడప క్రికెట్ అసోసియేషన్లు విచారణ జరిపి ఒక కోచ్ ను విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు మరో కోచ్ ను విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కడప క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, పొద్దుటూరు యూత్ క్లబ్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని గురువారం ఒక మీడియా సంస్థ సంప్రదించగా... ఇద్దరు కోచ్ లలో ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులు పది రోజుల క్రితం తమ దృష్టికి తీసుకు వచ్చారని, తరువాత తాము విచారణ చేపట్టామని అన్నారు.

బాలిక ఫిర్యాదు చేసిన కోచ్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. రెండో కోచ్ ను నెట్స్ కు రావద్దని చెప్పామని అన్నారు. కాగా, వేధింపుల ఘటన లో క్రికెట్ కోచ్ అహ్మద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు మూడో ఠాణా ఎస్సై రాజగోపాల్ తెలిపారు. 13 ఏళ్ల బాలిక క్రికెట్ కోచ్ అహ్మాద్ వద్ద శిక్షణ తీసుకుంటోందని ఈ క్రమంలో అహ్మద్ తనను ప్రేమించాలంటూ బాలికను నెలరోజుల నుంచి వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందింది అన్నారు.