రాజమండ్రి: ఓ తాగుబోతు నిర్వాకానికి ఓ కుటుంబం మొత్తం బలయ్యింది. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి ఆ తర్వాత తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... రాజమండ్రిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన శివపావని(27) కి విజయవాడకు చెందిన భూపతి నాగేంద్ర కుమార్ తో వివామమైంది. ఈ దంపతులకు నిషాంత్(9), రితిక(7) సంతానం. అయితే భర్త తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పాటు తనను నిత్యం వేధిస్తుండటంతో కొన్ని నెలలుగా పుట్టింట్లోనే వుంటోంది. 

ఈ క్రమంలో నాగేంద్ర మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇటీవలే తెలిసిన పావని తల్లితో కలిసి వెళ్లి భర్తను, అతడి కుటుంబసభ్యులను నిలదీశారు. అయితే నాగేంద్ర మరో పెళ్లి జరిగిందని... పావని వద్దకు రాడని చెప్పి దూషించడంతో పాటు దాడి చేశారు. 

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన పావని సోమవారం ఉదయం పిల్లలకు శీతలపానీయంలో విషం కలిపి తాగించింది. అనంతరం తల్లి కృష్ణవేణితో సహా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

సామూహిక ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న రాజమండ్రి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.