తన అభిమాన హీరో సినిమా బాగాలేేదని కర్నూల్ పట్టణానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నూల్: తాను ఎంతగానో అభిమానించే హీరో సినిమా చాలాకాలం నిరీక్షణ తర్వాత విడుదలయ్యింది. అయితే ఆ సినిమా అంచనాలకు తగ్గట్లుగా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయిన ఓ అభిమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం కర్నూల్ జిల్లా (kurnool district)లో చోటుచేసుకుంది.
కర్నూల్ పట్టణంలోని తిలక్ నగర్ లో నివాసముండే యువకుడు రవితేజ(24) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఎవరూలేని సమయంలో ఇంట్లోనే రవితేజ ఉరేసుకున్నాడు. ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు ఇది గమనించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
చేతికందివచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే యువకుడి ఆత్మహత్యకు ఇటీవల విడుదలైన ఓ సినిమాయే కారణమని తెలుస్తోంది. తన అభిమాన నటుడి సినిమా బాగాలేదని రవితేజ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని... అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకుని వుంటాడని అనుమానిస్తున్నారు.
ఇదిలావుంటే కన్నడ హీరో యష్ అభిమాని ఆత్మహత్య కర్ణాకటకలో కలకలం రేపింది. 25ఏళ్ల యువకుడు మరణం కుటుంబంతో పాటు యష్ ని విషాదంలో నింపింది. తాను జీవితంకి విఫలం చెందానని, కుటుంబ సభ్యుల ప్రేమను పొందలేక పోయానని ఆవేదనతో రామకృష్ణ అనే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలోని మాండ్యం జిల్లాలోని కోడిదొడ్డిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రామకృష్ణ సూసైడ్ నోట్ లో తాను హీరో యష్ కి వీరాభిమానిని అని పేర్కొన్నాడు. అలాగే మాజీ సీఎం కాంగ్రెస్ నేత సిద్దా రామయ్యకు కూడా తాను అభిమానిని అతడు వెల్లడించాడు. ఇలా తాను అభిమానించే యష్, సిద్దారామయ్య తన అంత్యక్రియలకు హాజరుకావాలని లేఖలో రామకృష్ణ పేర్కొన్నాడు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న హీరో యష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అభిమాని మృతిపై సోషల్ మీడియా వేదికగా యష్ స్పందించారు. హీరోలు తమ అభిమానుల నుండి ప్రేమ, ఆప్యాయత, విజిల్స్, చప్పట్లు వంటివి ఆశిస్తాం. అంతే కానీ ఇలాంటి బలవన్మరణాలు బాధ పెడతాయని ఆయన ట్విట్టర్ లో ఓ సందేశం పోస్ట్ చేశారు.
