మోడీతో భేటీ: బీజేపీలోకి మోహన్ బాబు కుటుంబం
తెలుగు సినీ రంగానికి చెందిన నటుడు మోహన్ బాబు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోడీతో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం సోమవారం నాడు భేటీ అయింది. బీజేపీలో చేరాలని మోహన్ బాబు కుటుంబాన్ని ప్రధానమంత్రి మోడీ ఆహ్వానించారు. సుమారు 15 నిమిషాల పాటు మోడీతో మోహన్ బాబు కుటుంబం సమావేశమైంది.
Also read:ఎవరిని అడగాలి, భయమా: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మోహన్ బాబు
2019 మార్చి 26వ తేదీన మోహన్ బాబు వైసీపీలో చేరారు. అంతకుముందు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ గురించి చిత్తూరు జిల్లాలోని తన విద్యా సంస్థల విద్యార్థులతో మోహన్ బాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సమయంలో ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది.
2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం మోహన్ బాబు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో బేటీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
నరేంద్రమోడీతో మోహన్ బాబుతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడ ఉన్నారు. 15 నిమిషాల పాటు మోడీతో మోహన్ బాబు బేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం.
బీజేపీలో చేరాలని మోహన్ బాబును మోడీ ఆహ్వానించినట్టుగా సమాచారం.. బీజేపీలో మోహన్ బాబు కుటుంబం చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై మోహన్ బాబు కుటుంబం నుండి స్పష్టత రావాల్సి ఉంది.
మోహన్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మోహన్ బాబు ఆ సమయంలో కొనసాగారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోహన్ బాబు తనయుడు విష్ణుకు వైఎస్ఆర్ సమీప బంధువు కుటుంబం నుండి అమ్మాయిని కోడలుగా తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆయన సన్నిహితంగా కొనసాగారు.
వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత గత ఏడాది ఎన్నికల సమయంలోనే మోహన్ బాబు వైసీపీలో చేరారు. ఇవాళ మోడీతో మోహన్ బాబు కుటుంబం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. 2014 ఎన్నికల సమయంలో కూడ మోహన్ బాబు నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.