తిరుమల: కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా దాదాపు రెండు నెలలు శ్రీవారిని దర్శనానికి దూరమయ్యారు భక్తులు. దీంతో టిటిడి భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. లాక్ డౌన్ సడలింపు తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇలా భక్తుల సంఖ్య తక్కువగా వున్నా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం గట్టిగానే వస్తోంది. 

నిన్న(గురువారం) ఒక్కరోజే కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వర స్వామిని 18,088 మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. అలాగే 6,318మంది తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. ఇక గురువారం ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 1.80 కోట్లు వచ్చిందని ఆలయ బోర్డు వెల్లడించింది. 

మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో) జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గురువారం లేదా శుక్రవారం ఆయన టీటీడీ ఈవోగా పదవీబాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. టీడీపీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను ఇటీవలే బదిలీ అవగా ఆయన స్థానంలో జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగా నియమితులయ్యారు.

1990 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. 1992 నుంచి 1994 వరకు నర్సాపూర్ సబ్ కలెక్టర్ గా, 1994-96 మధ్య ఐటీడీఏ పీవోగా, 1996-98 మధ్య నల్లగొండ జేసిగా, 1998-99 మధ్య డీపెప్ పీడీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

2005-08 మధ్య కాలంలో ఆయన మంచినీటి సరఫరా శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో ఎండీగా పనిచేశారు. 2008 నుంచి ఐదు నెలల పాటు హైదరాబాదు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చెర్మన్ గా పనిచేశారు.  2008 నుంచి 2009 వరకు హైదరాబాదు పట్టణాభివృద్ధి శాఖ మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేశారు. 2009-10 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. 

2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి 20188 వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. 2018లో జలవనరుల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డి 2019లో నియమితులయ్యారు.