చంద్రబాబు బెయిల్ పై మరికొద్దిసేపట్లో హైకోర్టు తీర్పు... సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్ర ప్రదేేశ్ మాజీ ముఖ్యమంత్రి మధ్యంతర బెయిల్ గడువు దగ్గరపడుతుండటంతో ఇవాళ వెలువడనున్న సాధారణ బెయిల్ పిటిషన్ తీరుపై ఉత్కంఠ నెలకొంది.

అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ పై బయట వున్నారు. అయితే తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలు పూర్తవగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై తీర్పును ఇవాళ(సోమవారం) 2.15 గంటలకు వెలువరించనున్నట్లు హైకోర్టు లిస్ట్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబంతో పాటు టిడిపి శ్రేణుల్లో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి యాభై రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది. చంద్రబాబును జైల్లోంచి బయటకు తీసుకువచ్చేందుకు సిద్దార్థ్ లూత్రా వంటి సుప్రీంకోర్టు లాయర్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు జైల్లో పరిస్థితులు, వయసు మీదపడటంతో అనారోగ్యం బారినపడ్డ చంద్రబాబు వైద్యం చేయించుకోడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరాడు. దీంతో న్యాయస్థానం నాలుగు వారాలపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైల్లోంచి బయటకువచ్చి ప్రస్తుతం హైదరాబాద్ లో వున్నారు.
అయితే కేవలం వైద్యం కోసమే బెయిల్ మంజూరు చేసినట్లు... ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదంటూ న్యాయస్థానం షరతులు విధించింది. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా వుండాలని... కేసును ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదని ఆదేశించింది. దీంతో జైల్లోంచి బయటకు వచ్చినా ఇంటికే పరిమితం అయ్యారు చంద్రబాబు. ఈ మధ్యంతర బెయిల్ గడువు నవంబర్ 28 తో ముగియనుంది.
Read More Nara Lokesh : పాదయాత్రపై లోకేష్ కీలక నిర్ణయం... తండ్రి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడా..!
సాధారణ బెయిల్ లభిస్తే చంద్రబాబు రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాకాకుండా బెయిల్ ను హైకోర్టు నిరాకరిస్తే న్యాయవాదుల సలహామేరకు ఏం చేయాలో ఆలోచించనున్నారు. మొత్తంగా హైకోర్టు తీర్పుపై టిడిపి శ్రేణులే కాదు వైసిపి వాళ్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.