ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తండ్రి చంద్రబాబు సెంటిమెంట్ నే ఫాలో కావాలని నారా లోకేష్ చూస్తున్నారట.
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో టిడిపి కార్యక్రమాలన్ని అర్దాంతరంగా ఆగిపోయాయి. టిడిపి శ్రేణులంతా చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు, ఆందోళనలకే పరిమితమై ప్రజలకు కాస్త దూరంగా వున్నారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఇక నాయకులంతా ప్రజల్లో వుండేలా టిడిపి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబును అరెస్ట్ తో ఆగిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ సిద్దమయ్యారు. పాదయాత్ర పున:ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారయినట్లు సమాచారం.
నవంబర్ 24 నుండి లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభం కానున్నట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయట.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడయితే పాదయాత్ర అర్ధాంతరంగా ముగిసిందో అక్కడినుండే తిరిగి ప్రారంభం కానుందట. అయితే ముందుగా అనుకున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించిన లోకేష్ తాజాగా విశాఖపట్నంలోనే ముగించాలన్న ఆలోచనతో వున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు కూడా తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు. ఇదే సెంటిమెంట్ ను లోకేష్ ఫాలో అయితే మరో పదిపదిహేను రోజుల్లో లోకేష్ పాదయాత్రను ముగిసే అవకాశాలున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో అంటే జనవరి 2023 లో లోకేష్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం నుండి ప్రారంభమైన పాదయాత్ర రాయలసీమలో ముగిసి కోస్తాంధ్రలో వరకు కొనసాగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పాదయాత్ర కొనసాగుతుండగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్... ఆ తర్వాత దాదాపు 50 రోజులకు పైగా జైల్లో వుండాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర చాలాకాలం ఆగిపోయింది.
Read More జగన్ రెడ్డీ... రక్తంతో పల్నాడును సస్యశ్యామలం చేస్తావా..: టిడిపి నేత హత్యపై లోకేష్ సీరియస్
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం... అధినేత చంద్రబాబు కోర్టు ఆదేశాలతో రాజకీయాలకు దూరంగా వుండటంతో లోకేష్ పాదయాత్రను ఎక్కువరోజులు కొనసాగించలేకపోతున్నారని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. త్వరగా పాదయాత్రను ముగించి రాబోయే ఎన్నికల కోసం పార్టీని సన్నద్దం చేసే బాధ్యతలు ఆయన తీసుకోనున్నారని తెలిపారు. అయితే లోకేష్ పాదయాత్రపై ప్రచారం జరుగుతున్నా ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
