విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రేపు(జూన్ 3వ తేదీన) కేరళ తీరాన్ని తాకనున్నాయి. వరుసగా మూడు రోజులు వర్షాలు పడితే నైరుతి రుతుపవనాలు వచ్చినట్లు నిర్ధారిస్తారు. కేరళలో నిన్నటి నుండి వర్షాలు కురస్తున్నాయి. కాబట్టి రేపు(గురువారం) రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించే అవకాశం ఉంది.

ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో బుధవారం తెలంగాణలో గాలివానలు, కోస్తాంధ్ర రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక కోస్తాంధ్రలో అక్కడక్కడ   భారీ వర్షాలు పడవచ్చని... ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

ఇక గురువారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవనుంది ఐఎండి డిజి మృత్యుంజయ్‌ మహాపాత్రా ఇప్పటికే వెల్లడించారు. మధ్య భారతదేశంలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందన్నారు. ఇక ఈశాన్య భారత రాష్ట్రాల్లో  సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి డిజి ప్రకటించారు.

ఈ నైరుతి రుతుపవనాలతో 101 శాతం వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. పసిపిక్, హిందూ మహాసముద్రాల్లోని నీటి ఉష్ణోగ్రతల ప్రభావం భారతదేశంలో వానాకాలంపై వుంటుందని... అందువల్లే అక్కడి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తున్నామని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ నెల 3వ తేదీన కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాస్త ఆలస్యమైనా రుతుపవనాలు దేశంలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. యాస్ తుఫాన్  నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించడానికి దోహదం  చేసిందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.