ఏపీ కేబినెట్ మార్పు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో మంత్రులకు క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి (AP Cabinet)లో మార్పులు చేర్పులకు సీఎం జగన్ (ys jagan) సిద్దమయ్యారన్న ప్రచారానికి బలం చేకూర్చే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన కేబినెట్ బేటీలో మంత్రిమండలి మార్పు గురించి సీఎం జగన్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. తాజాగా వైసిఎల్పీ (yclp)తో సీఎం జగన్ ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు సమావేశం ఏర్పాటుచేసారు. కేబినెట్ మార్పులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకే సీఎం జగన్ ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. దీంతో పదవి కోల్పోతామన్న అనుమానాలున్న మంత్రుల్లో టెన్షన్ నెలకొనగా మంత్రిపదవి దక్కుతుందని ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో ఉత్కంఠ పెరిగింది. 

రెండున్నరేళ్ళ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు కేబినెట్ మార్పుపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతున్న కేబినెట్ నుండి ఎవరిని తప్పిస్తారు.. కొత్తగా ఎవరికీ అవకాశం దక్కే అవకాశాలున్నాయో ఈ సమావేశం అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. అయితే కేబినెట్ మార్పుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి. 

గతంలో వైసిపి (ysrcp) ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సీఎం జగన్ రెండున్నరేళ్ళ తర్వాత మళ్లీ కేబినెట్ లో మార్పుచేర్పులు వుంటాయని ప్రకటించారు. మంత్రి పదవులు దక్కనివారు నిరాశపడవద్దని... తర్వాత అవకాశం వస్తుందని ఎమ్మెల్యేలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా కేబినెట్ మార్పులకు జగన్ సిద్దమయ్యారు. అయితే కొందరు సీనియర్ మంత్రులను కొనసాగిస్తూనే కొత్తవారికి అవకాశమివ్వాలని జగన్ చూస్తున్నారట. ఇదే విషయాన్ని ఇవాళ జరిగే వైసిఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు జగన్ తెలియజేయనున్నారు. 

వైసిపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకమయ్యే దిశగా రాజకీయ సమీకరణ మారుతుండటం కూడా అత్యవసరంగా వైసిఎల్పీ సమావేశమవడానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటినుంచే ఎన్నికలకు ఎమ్మెల్యేలను సంసిద్దం చేయాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఇవాళ్టి వైసిఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఆ దిశగానే సామాజిక సమీకరణ, జిల్లాల పరిస్థితులు, ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో వుంచుకుని మంత్రిమండలి మార్పుచేర్పులు చేయాలని జగన్ నిర్ణయించారట. తన ఆలోచనలను సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో పంచుకోనున్నారు.

మంత్రివర్గం నుండి తప్పించినా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తానని జగన్ ఇప్పటికే మంత్రులకు తెలిపారు. అయితే తాజాగా మంత్రిపదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలను కూడా ఇలాగే ముందుగానే సీఎం జగన్ సముదాయించే అవకాశాలున్నట్లు సమాచారం. మంత్రి పదవి దక్కని ఎమ్మెల్యేలకు కూడా పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సీఎం సూచించే అవకాశముంది. దీంతో మంత్రిమండలిలో మార్పుల తర్వాత పార్టీ పదవుల్లోనూ మార్పుచేర్పులు వుండనున్నాయన్న మాట. 

ప్రతిపక్షాలు ఐక్యమవుతున్న నేపథ్యంలో 2014 ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరు కష్టపడాలని సీఎం సూచించే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఎలా ముందుకు వెళ్లాలన్నదానికి కూడా సీఎం జగన్ ఎమ్మెల్యేలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది. అవసరమైతే ముందుస్తుకు వెళ్ళినా సంసిద్దంగా వుండాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలకు సూచించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.