తిరుమల వెంకన్నకు కాసుల వర్షం: ఆగస్టులో రూ. 120 కోట్ల ఆదాయం
తిరుమల వెంకన్నకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో రూ. 120 కోట్ల ఆదాయం వచ్చింది.
తిరుపతి: తిరుమల శ్రీవారికి మరోసారి భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు మాసంలో తిరుమల వెంకన్న హుండీకి రూ. 120.05 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టులో మొత్తం 22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు శుక్రవారంనాడు ప్రకటించారు.
ఆగస్టులో కోటి 9 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. 43.07లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. కరోనా తర్వాత తిరుమల శ్రీవారికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అంతే కాదు తిరుమల ఆలయ ఆదాయం పెరుగుతూ వస్తుంది. గత ఏడాది మార్చి నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు తిరుమల వెంకన్న ఆదాయం రూ. 100 కోట్లు దాటుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
2022 ఆగస్టు మాసంలో రూ. 140.34 కోట్ల ఆదాయం వచ్చింది. 2022 ఆగస్టు మాసంలో 22.22 లక్షల మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. 1.5 కోట్ల లడ్డూలను విక్రయించింది టీటీడీ.ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అదే విధంగా అక్టోబర్ 15 నుండి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది టీటీడీ.
అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. అలాగే అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అధికారులు చెప్పారు.