సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం కారణంగా అక్టోబర్ 25, నవంబర్ 8 తేదీలలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణం సందర్భంగా ఈ రెండు రోజులూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 25, నవంబర్ 8 తేదీలలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం కారణంగా రాత్రి 7.30 వరకు ఆలయాన్ని మూసివేస్తామని.. అలాగే నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజున రాత్రి 7.20 వరకు ఆలయాన్ని మూసివేస్తామని టీటీడీ వెల్లడించింది. గ్రహణం సందర్భంగా ఈ రెండు రోజులూ వీఐపీ బ్రేక్, శ్రీవాణి, రూ.300 దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కేవలం సర్వదర్శనం మాత్రమే వుంటుందని, భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.
ఇకపోతే.. తిరుమలలో గదుల కేటాయింపులో తరచూ అక్రమాలు జరుగుతుండటం, పలువురు పట్టుబడుతూ వుండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సీరియస్‌గా దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా గదుల కేటాయింపు ప్రక్రియపై ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో భేటీ అయ్యారు. ఇప్పటికే గదుల కేటాయింపులో వున్న లోపాలను టీటీడీ గుర్తించింది. గదుల కేటాయింపులో దళారులను ఏరివేసేలా.. పోలీస్, విజిలెన్స్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ధర్మారెడ్డి నిర్ణయించారు.
Also REad:ఆగస్ట్ 24న అక్టోబర్ మాసం ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. టీటీడీ ప్రకటన, వివరాలివే
మరోవైపు.. టీటీడీలో ఇంటి దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్న టీటీడీ సూపరింటెండెంట్ మల్లిఖార్జున్‌తో పాటు ఇద్దరు మహిళల్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా భారీగా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 760 బ్రేక్ దర్శన టికెట్లు, 350 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, 25 సుప్రభాత సేవా టికెట్లను, 32 గదులను విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.
