Asianet News TeluguAsianet News Telugu

టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు:ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షాబ్జీపై కేసు

తిరుమల విజిలెన్స్ అధికారుల  ఫిర్యాదుతో   ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ  షేక్ షాబ్జీపై   కేసు నమోదైంది.  తిరుమల పోలీసుల అదుపులో  షాబ్జీ ఉన్నారు.

Tirumala Police Files Case Against East and West Godavari Teacher MLC Shaik Sabji  lns
Author
First Published Apr 21, 2023, 3:08 PM IST

తిరుమల: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీపై  తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.   తిరుమల విజిలెన్స్ అధికారులు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు  చేశారు. మరో వైపు  తిరుమల పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ  షేక్ షాబ్జీ ఉన్నారు. 

ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ తరుచుగా  తిరుమల వెంకన్న దర్శనానికి  వస్తున్నారు. దీంతో  టీటీడీ అధికారులకు  అనుమానం వచ్చింది. దీంతో విజిలెన్స్ అధికారులకు  సమాచారం  ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు ఈ విషయమై  నిఘా ఏర్పాటు చేయడంతో  అసలు విషయం వెలుగు చూసింది.  ఫోర్జరీ  ఆధార్ కార్డులతో  భక్తులను  తిరుమల వెంకన్న దర్శనానికి తీసుకువస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు  చెందిన భక్తులను రాష్ట్రానికి  చెందిన భక్తులుగా ఫోర్జరీ ఆధార్ కార్డులతో  తిరుమల దర్శనానికి తీసుకువస్తున్నారని  విజలెన్స్ అధికారులు గుర్తించారు. 

నెల రోజుల వ్యవధిలో   19 సిఫారసు లేఖను   ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ జారీ చేసినట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.  ఆరుగురు భక్తులకు  వెంకన్న దర్శనం కోసం  రూ. 1.05 లక్షలు తీసుకున్నట్టుగా  విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఎమ్మెల్సీ డ్రైవర్  ఖాతాలో  ఈ డబ్బులు జమ చేశారని  విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇదే తరహలో  ఇంకా ఎవరైనా భక్తులకు  దర్శనాలు చేయిస్తున్నారా అనే కోణంలో కూడా   టీటీడీ అధికారులు  ఆరా తీస్తున్నారు. 2021 మార్చిలో  జరిగిన ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుండి షాబ్జీ  ఎన్నికయ్యారు. ఈ విషయమై  షాబ్జీ  ఏం చెబుతారనేది  ప్రస్తుతం  ఆసక్తి నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios