శ్రీవారి సన్నిధిలో ఇదేం విచిత్రం ... వర్షాకాలంలో మండు వేసవి పరిస్థితి..!
దేశంలోనే రిచ్చెస్ట్ దేవుడి భక్తులకు నీటికష్టాలు తప్పేలా లేవు. వర్షాకాలంలో మండు వేసవి పరిస్థితులు తిరుమల శ్రీవారి సన్నిధిలో కనిపిస్తున్నాయి.
Tirumala : వర్షాకాలంలో నీటికష్టాలు... అదీ దేశంలోని రిచ్చెస్ట్ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో... భక్తులు కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే వెంకటేశ్వరస్వామి సన్నిధిలో. నిత్యం లక్షలాదిమంది భక్తులు, వేలాదిమంది టిటిడి ఉద్యోగులు, చిరు వ్యాపారులతో కిటకిటలాడే ఏడుకొండలవాడి సన్నిధిలో నీటికొరత కంగారు పెడుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ భవిష్యత్ నీటి ఎద్దడి సమస్యను ముందుగానే గుర్తించి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై నీటి పొదుపు చర్యలు చేపట్టింది.
తిరుమలలో కురిసిన వర్షపునీటిని ఒడిసిపట్టి నిత్యావసరాలకు ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీంతో తిరుమలకు నీటి సరఫరా జరిగే జలాశయాలు నిండలేదు. మరోవైపు ఈ జలాశయాల నుండి నిత్యం నీటి సరఫరా కొనసాగుతుండటంతో రోజురోజుకు తగ్గుతున్నాయి. ప్రస్తుతం జలాశయాల్లో నీటి పరిస్థితి ఆందోళనకరంగా వుండటంతో టిటిడి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. భవిష్యత్ లో స్వామివారి సన్నిధిలో నీటిఎద్దడి వుండకుండా ఇప్పటినుండే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది టిటిడి.
తిరుమలలో ప్రస్తుత నీటి పరిస్థితి :
తమ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తుల కోసం ఏడుకొండలపై అన్ని సౌకర్యాలను ఏర్పాటుచేసింది టిటిడి. భక్తులు, ఉద్యోగులు, వ్యాపారుల నిత్యావసరాలు... వంటశాలలు, అతిథి గృహాలు, స్నానఘట్టం వంటివాటిలో నీటి వినియోగం కోసం తిరుమలలో పలు డ్యాంలను నిర్మించారు. ప్రతిఏటా కురిసే వర్షపునీటిని ఈ డ్యాంలలో నిల్వచేసి ఏడాదిపొడవునా తిరుమలకు నీటి సరఫరా చేస్తారు.
అయితే ఆ ఏడాది ఇప్పటివరకు చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీంతో తిరుమలకు నీరు సరఫరా చేసే గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌లకు తగినంత నీరు చేరలేదు. ఇదే సమయంలో ఈ డ్యాంల నుండి యధావిధిగా నీటి సరఫరా జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కేవలం 120 నుండి 130 రోజుల్లో ఐదు ప్రధాన డ్యామ్‌లలోని నీరుమొత్తం ఖాళీ అవుతుందని... తిరుమలలో నీటి ఎద్దడి ఏర్పడుతుందని టిటిడి ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలని భక్తులనే కాదు తిరుమలలో వుండే ప్రతి ఒక్కరినీ హెచ్చరించింది టిటిడి.
తిరుమలలో ప్రతిరోజూ నీటి వినియోగం :
తిరుమల నిత్యం కిటకిటలాడుతూ వుంటుంది. ప్రతిరోజు లక్షలాదిమంది ఏడుకొండలపైకి రాకపోకలు సాగిస్తారు. వీరితో పాటు టిటిడి ఉద్యోగులు, వ్యాపారులు భారీ సంఖ్యలో వుంటారు. ఇలా అందరి అవసరాల కోసం ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీరు వినియోగిస్తారు. ఇందులో 18 లక్షల గాలన్లు తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల నుండి... మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరిస్తున్నారు. ఈ ఆరు డ్యామ్ లు తిరుమల నీటి అవసరాలను తీరుస్తున్నాయి.
అయితే ప్రస్తుతం వర్షాభావ పరిస్ధితులతో ఈ డ్యామ్ లలో నీటి సామర్థ్యం భారీగా తగ్గింది. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యాముల్లో మొత్తం నీటినిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా ప్రస్తుతం కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని కళ్యాణి డ్యామ్ పరిస్థితి కూడా ఇలాగే వుంది. దీంతో తిరుమలలో డేంజర్ బెల్స్ మోగాయి.
ఓవైపు నీటి సమస్య... మరోవైపు భక్తుల సంఖ్య పెరుగుతుండటం టిటిడిని కంగారు పెడుతోంది. ముఖ్యంగా అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో వుంచుకుని నీటి ఎద్దడి రాకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టింది టిటిడి.
నీటి వృథాను అరికట్టడంతో పాటు వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టిటిడి నిర్ణయించింది. తిరుమలలో స్థానికులు నివాసముండే బాలాజీ నగర్ కు ఆరు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయనున్నారు... ఇక వ్యాపార సంస్థలకు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు అంటే రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే నీటిని సరఫరా చేయనున్నారు. ఇక తిరుమలలో నిర్మిస్తున్న అతిథి గృహలకయితే నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నారు. అవసరం ఉంటే ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకోవాలని దాతలకు సూచించారు. ఆగస్ట్ 25 నుండి ఈ నీటి పొదుపు చర్యలు అమలులోకి రానున్నాయి.