Lok Sabha: ఏపీలో మెజార్టీ సీట్లు టీడీపీకా? వైసీపీకా?.. టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వే అంచనాలు ఇవే
జాతీయ మీడియా ఏపీలో జరిగే పార్లమెంటు ఎన్నికలపై సర్వేలు నిర్వహించాయి. ఇండియా టుడే విడుదల చేసి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టీడీపీ గణనీయంగా 17 ఎంపీ సీట్లు వస్తాయని, ఇక వైసీపీ 8 సీట్లకే పరిమితం అవుతుందని వివరించింది. ఇక టైమ్స్ నౌ మాత్రం ఇందుకు భిన్నంగా అంచనా వేసింది. వైసీపీకి గరిష్టంగా 19 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ-జనసేన పార్టీలు కలిసి 6 సీట్లు గెలుచుకుంటుందని వివరించింది.
Andhra Pradesh: తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. కానీ, ఏపీలో పరిస్థితి వేరు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకోగలదనే అంచనాలను రెండు సర్వేలు వెల్లడించాయి.
ఏపీలో ఎంపీ సీట్లు ఏ పార్టీ ఎన్ని గెలుచుకోగలదనే విషయంపై రెండు సర్వేలు (మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే సర్వే, టైమ్స్ నౌ, మ్యాట్రిజ్ న్యూస్ సంయుక్తంగా చేపట్టిన సర్వే) తమ అంచనాలను తెలిపాయి. అయితే.. ఈ రెండు సర్వేలు భిన్నమైన అంచనాలను వెల్లడించడం గమనార్హం. అసలు ఏపీ ప్రజల నాడీ సర్వే నిర్వాహకులకూ చిక్కడం లేదా? ఈ రెండు సర్వేలు ఏం చెబుతున్నాయి?
ఇండియా టుడే సర్వే:
గతేడాది డిసెంబర్ 15 నుంచి జనవరి 28వ తేదీ వరకు 35,801 శాంపిళ్లను సేకరించి మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను ఇండియా టుడే నిర్వహించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా టీడీపీ 17 సీట్లు గెలుచుకుంటుందని, ఓటు శాతం 45 సాధించుకుంటుందని తెలిపింది. ఇక 41 శాతం ఓటు శాతంతో వైసీపీ 8 ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. మిగిలిన మరే పార్టీ కూడా ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకునే అవకాశం లేదని పేర్కొంది.
2019లో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాల్లోకెల్లా 151 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అలాగే 22 లోక్ సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. కాగా, టీడీపీ 3 స్థానాలకే పరిమితం అయింది.
టైమ్స్ నౌ సర్వే:
టైమ్స్ నౌ, మ్యాట్రిజ్ న్యూస్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం వైసీపీ గరిష్టంగా 19 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, టీడీపీ-జనసేన 6 సీట్లను గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇక బీజేపీ, కాంగ్రెస్‌లకు గతంలో మాదిరే ఒక్క ఎంపీ సీటు కూడా దక్కదని తెలిపింది.