గురువారం రాత్రి తిరుమలలో మూడేళ్ల బాలుడిపై చిరుత దాడిలో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సురక్షితంగా ఉన్నాడని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 

తిరుపతి : తిరుమల నడకదారిలో గురువారం రాత్రి చిరుత దాడి చేసి.. లాక్కెళ్లడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారి క్షేమంగా ఉన్నాడని.. ప్రాణాపాయం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిరుత సంవత్సరన్నర కూన కావడంతో ప్రమాదం తప్పిందన్నారు. నోటితో కరిచి పట్టుకోవడం దానికి రాకపోవడం వల్లే బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడన్నారు. చిరుత చిన్నది కాబట్టి బాలుడిని సరిగా పట్టుకోలేకపోయింది..వేట చేయడం చేతకాక, కాలుతో పట్టుకుని వెళ్లింది. నోటితో పట్టుకోలేదు.. కాబట్టి బాలుడు బతికాడు.. నోటితో కరిస్తే బతికే ఛాన్స్ లేదు అన్నారు.

చిరుత పిల్ల కావడంతో వేటాడం రాక... కాళ్లతో పట్టుకెళ్లిందని దీనివల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడిలో గాయపడిన చిన్నారిని కర్నూలు జిల్లా ఆధోనికి చెందిన 3యేళ్ళ చిన్నారి కౌశిక్ గా గుర్తించారు. కుటుంబంతో కలిసి తిరుమల-అలిపిరి నడక దారిలో వెడుతుండగా ఈ ఘటన జరిగింది. బాలుడు కుర్ కురే కావాలనడంతో రాత్రి 9 గంటల సమయంలో కొనివ్వడానికి తాత తీసుకెళ్లాడు. 

తిరుమలలో కలకలం : ఐదేళ్ల బాలుడిపై దాడి, చిన్నారిని నోటకరచుకెళ్లిన చిరుత

ఆ సమయంలో ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. దీంతో తాత, దుకాణదారులు, సిబ్బంది అరుపులు, కేకలు వేస్తూ.. పులి వెనుక పరుగులు పెట్టారు. టార్చ్ లైట్లు వేస్తూ, రాళ్లు విసురుతూ... గొడవ చేయగా చిరుత పోలీస్ ఔట్ పోస్ట్ దగ్గర బాలుడిని వదిలేసి పారిపోయింది. అక్కడున్న పోలీసులు చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడికి ప్రథమ చికిత్స చేశారు. 

ఆ తరువాత తిరుపతి పద్మావతి హృదయాలయాలో చికిత్స అందిస్తున్నారు. స్విమ్స్ లో బాలుడికి చికిత్స చేస్తున్నారని.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని ధర్మారెడ్డి తెలిపారు. ఆ చిరుత వయసు ఒకటిన్నర సంవత్సరం వయసున్న పులి పిల్ల..అది పెద్దదైతే బాలుడు దక్కేవాడు కాదన్నారు. 

ఈ దాడి గురించి టీటీడీ సీరియస్ గా తీసుకుందని.. ఫారెస్ట్ అధికారులు వెళ్లి సైట్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిపారు. బాలుడికి ప్లాస్టిక్ సర్జరీ అయ్యిందని తెలిపారు. సీటీ స్కాన్ లో ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. చిరుత సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోమని సిబ్బందిని అప్రమత్తం చేశాన్నారు.

రాత్రిపూట భక్తులను ఏ సమయం వరకు పంపించాలో చూస్తున్నామన్నారు. భక్తులను.. గుంపులు గుంపులుగా పంపించాలని ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఇప్పటికే చాలా జాగ్రాత్తలు తీసుకుంటున్నామని ఈ ఘటన నేపథ్యంలో వాటిని మరింత పెంచుతామన్నారు. 

శ్రీవాణి ట్రస్టు మీద కూడా మాట్లాడాడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవాణి ట్రస్టు మీద అవాస్తవమైన అభియోగాలు చేశారు. అందుకే శ్వేతపత్రం విడుదల చేశాం అన్నారు.