కర్నూల్: 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాయ‌ల‌సీమ జిల్లాల్లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య టిక్కెట్ల పోరు నడుస్తోంది. టిక్కెట్ల పంపకాలు ఇంకా మెుదలుపెట్టక ముందే నేతల మధ్య కోల్డ్ వార్ మెుదలైంది. నువ్వెంత అంటే నెవ్వెంత అనుకునేంతగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. 

అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మెుదలవ్వాల్సిన రచ్చ ముందే స్టార్ట్ అవ్వడంతో టీడీపీ నాయకత్వం తలలుపట్టుకుంటోంది. అంతా స‌ర్ధుకు పోవాల‌ని సూచించినా నేతలు లెక్కచెయ్యడం లేదు. కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే అందులో సగానికిపైగా నియోజకవర్గాల్లో విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. 
 
ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోడుమూరు నియోజకవర్గం విబేధాలు మరో ఎత్తు. కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీలోని వ‌ర్గ విభేదాలు మాత్రం రచ్చకెక్కుతున్నాయి. అందుకు అసలు కారణం ఎమ్మెల్యే మణిగాంధీయే కావడం విశేషం. మణిగాంధీ టార్గెట్ గా టీడీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. 

కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మణిగాంధీ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గెలుపొందిన కొద్ది రోజులకే ఆయన టీడీపీలో చేరిపోయారు.  మణిగాంధీ టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీలో గొడవలు మెుదలయ్యాయి. 

ఎమ్మెల్యే అయినా తనను పట్టించుకోకుండా అన్నింటిలో విష్ణువర్థన్ రెడ్డి వేలుపెడుతున్నారంటూ మణిగాంధీ ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ అయినంత మాత్రాన అధికారిక కార్యక్రమాల్లో కూడా తలదూర్చుతారా అంటూ చిర్రుబుర్రులాడారు. దీంతో ఇరువురి మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. 

ఈ పోరు ఎంతవరకు వచ్చిందంటే నియోజకవర్గ అభివృద్ధి పనులు నిలిచిపోయేంత వరకు వచ్చింది. తాను నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మణిగాంధీ అడ్డుకుంటున్నారని విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు ఒకరు ప్రతిపాదించిన పనులకు మరోకరు అభ్యంతరం చెప్తున్నారు. 

మణిగాంధీ వేరే పార్టీ నుంచి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే అంటూ విష్ణువర్థన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆ పార్టీలో అలజడి రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం విష్ణువర్థన్ రెడ్డి గట్టి లాబీయింగ్ చేస్తున్నారు. అయితే టిక్కెట్ మణిగాంధీకే అంటూ ప్రచారం జరుగుతుండటంతో విష్ణువర్థన్ రెడ్డి మండిపడుతున్నారు.   
 
రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ మణిగాంధీకి ఇస్తే తాను పార్టీలో కొనసాగలేనని విష్ణువర్థన్ రెడ్డి బాహటంగానే స్పష్టం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు ప‌ట్టు ఉంద‌ని కాబట్టి తనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. లేని పక్షంలో పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ సైతం ఇస్తున్నారు.