విగ్రహాల విధ్వంసం ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. రోజులో ఆలయంలో దుండగులు తెగబడుతున్నారు. ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులతో ఏపీ అట్టుడుకుతోంది.  ఏదో ఒక రూపంలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. 

తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటన మరవకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. సింగరాయ కొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మి, గరుత్మంతుడు విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. 

మంగళవారం ఉదయం ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. 
సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై సంపత్ కుమార్ సంఘటనాస్థలికి చేరుకుని ముఖద్వారాన్ని విగ్రహాలను పరిశీలించారు. 

ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, లేక వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.