ఏపీలో మూడు జిల్లాలకు కొత్త విమానాశ్రయాలు
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పుంజుకుంటోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఊపందుకుంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్‌డీయే ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో రాష్ట్ర ప్రగతిలో కీలకమయ్యే ప్రాజెక్టులు వేగవంతంగా మంజూరు అవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం వివిధ శాఖలపై సమీక్షిస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులపై అంచనా వేస్తున్నారు. అలాగే, నిధులు, ప్రాజెక్టుల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి, శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. దీని ద్వారా కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా ఆర్థిక పురోగతిని కూడా ప్రోత్సహించవచ్చని తెలిపారు.
కాగా, ఇప్పటికే విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్‌పోర్టు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అధికారులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగంగా చేయాలని.. గడువు కంటే ఆరు నెలల ముందే పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ జీఎమ్మార్ ప్రతినిధులకు సూచించారు. కాగా విశాఖపట్నం ఎయిర్‌పోర్టు కంటే మెరుగైన వసతులతో భోగాపురంలో విమానాశ్రయం నిర్మిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మినీ ఎయిర్‌పోర్టులు తీసుకొచ్చేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంతో పాటు వివిధ నగరాలకు ఏపీ నుంచి ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు ఎంపీలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ముంబయికి, విజయవాడ నుంచి కర్నూలుకు కొత్త ఫ్లైట్ సర్వీసు ప్రారంభమైంది.