కలియుగదైవం తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తిప్రపత్తులతో కొలిచి తిరిగి ఇళ్లకు బయలుదేరిన కొందరు అనంతపురం జిల్లాకు చెందిన భక్తులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్ధలంలోనే మరణించగా మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. 

అనంతపురం: కలియుగదైవమైన ఆ ఏడుకొండలవాసున్ని దర్శించుకున్న కొందరు భక్తులు స్వస్థలానికి తిరిగివెళుతుండగా ఘోరం జరిగింది. ఒకే గ్రామానికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సు అతివేగంతో వెళుతూ అదుపుతప్పడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా(anatapur district) నల్లమాడ మండలం  పులగంపల్లికి చెందిన 15మంది ఓ మినీ బస్సులో తిరుమతికి వెళ్లారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారు శనివారం అదే బస్సులో తిరుగుపయనమయ్యారు. అయితే మరికొద్దిసేపట్లో ఇళ్లకు చేరుకుంటారనగా  పులంగంపల్లి సమీపంలోనే ఈ మినీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. 

అతివేగంతో వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ  ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 

రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.  ముందుగా గాయపడిన క్షతగాత్రులను చికిత్సనిమిత్తం దగ్గర్లోని కదిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా గాయపడిన క్షతగాత్రులు చెబుతున్నారు. బస్సును అతివేగంగా పోనిస్తూ అదుపు చేయలేక కొందరి ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు మరికొందరిని హాస్పిటల్ పాలు చేసారని తెలిపారు. దైవదర్శనానికి వెళ్లిన వారు ఇలా శవాలుగా తిగిరావడంతో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇదిలావుంటే చిత్తూరు జిల్లాలోని త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దు ప్రాంతంలో శుక్ర‌వారం సాయంత్రం ఘోర ప్రమాదం జ‌రిగింది. వేగంగా వెళుతున్న కారు బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  

చిత్తూరు జిల్లాకు చెందిన జ‌య‌సింహ(26), ఉపేంద్ర(45) వంశీ, నాని, లోకేష్ లు ప‌ల‌మ‌నేరు ప్రాంతం నుంచి కారులో వేలూరుకు వెళ్తున్నారు. అయితే సైనిగుంట వ‌ద్ద‌కు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుత‌ప్పి చెట్టును ఢీకొట్టింది. అనంత‌రం కారు బోల్తా ప‌డింది. దీంతో కారు డ్రైవ్ చేస్తున్న జ‌య‌సింహ‌తో పాటు ముందు సీట్లో కూర్చున్న ఉపేంద్ర ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందారు. వెన‌క సీట్లో కూర్చున్న ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా ప్ర‌స్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.