ఏలూరు యాసిడ్ దాడి ఘటన.. ముగ్గురికి జీవిత ఖైదు.. 117 రోజుల్లోనే శిక్ష ఖరారు!!
ఏలూరులో 35 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు బోడ నాగ సతీష్, బెహరా మోహనం, ఉషా కిరణ్‌లను దోషులుగా నిర్దారించిన ఏలూరు జిల్లా ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు.. వారికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

ఏలూరులో 35 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు బోడ నాగ సతీష్, బెహరా మోహనం, ఉషా కిరణ్‌లను దోషులుగా నిర్దారించిన ఏలూరు జిల్లా ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు.. వారికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగ సతీష్‌కు జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా, యాసిడ్ దాడికి పాల్పడిన బెహరా మొహనం, ఉషాకిరణ్‌లకు జీవిత ఖైదుతో పాటు రూ. 15 వేల చొప్పున జరిమానా, వారి సహచరుడు కొల్లా త్రివిక్రమరావుకు రూ. 1,500 జరిమానా విధించింది. అయితే యాసిడ్ దాడిలో మహిళ ప్రాణాలు తీసిని ముగ్గురికి.. 117 రోజుల్లోనే శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే..
ఏలూరులోని కెవియర్ నగర్లో నివాసముంటున్న ఎడ్ల ప్రాన్సిక దుగ్గిరాల సమీపంలోని ఓ ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె కొంతకాలం క్రితమే భర్తతో విడిపోయారు. ఇక, ఫ్రాన్సికా సోదరితో ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన బోడ నాగ సతీష్ సన్నిహితంగా ఉండేవాడు. అయితే తన సోదరికి దూరంగా ఉండాలని నాగ సతీష్‌కు ఫ్రాన్సికా చెప్పింది. ఈ క్రమంలోనే ఫ్రాన్సికాపై కక్ష పెంచుకున్న నాగ సతీష్.. ఆమెను హత్య చేయాలని భావించారు. ఇందుకు మొహనం, ఉషా కిరణ్‌లకు సుపారీ ఇచ్చారు. వారు ఈ ఏడాది జూన్ 13న రాత్రి విధుల నుంచి ఇంటికి వస్తుండగా ఫ్రాన్సికాపై యాసిడ్ దాడి చేశారు.
దాడి అనంతరం బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంగళగిరి మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో పోరాడుతూ.. ప్రాన్సికా జూన్ 21 ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. అతి తక్కువ వ్యవధిలో విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ 117 రోజుల్లో విచారణను పూర్తి చేసి తీర్పును వెలువరించారు.