అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదన అమలులోకి రావడం అంత సులభంగా కనిపించడం లేదు. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుపుల్ల వేసింది. శాసన మండలి చైర్మన్ 71 నిబంధన కింద ఏపీ పాలనా వీకేంద్రీకరణ బిల్లుపై చర్చకు అనుమతించడం జగన్ కు పెద్ద షాక్. 

బిజెపి నేతలు జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మినారాయణ వైఎస్ జగన్ నిర్ణయంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అదే సమయంలో మరో పరిణామం కూడా చోటు చేసుకుంది.  అమరావతి రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు వచ్చారు. ఆయన ఇంటి ముందు వారు నిరీక్షిస్తున్నారు. 

Also Read: భూదందాల కోసమే: వైఎస్ జగన్ మూడు రాజధానులపై జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు

జగన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెట్టించాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. తమ ప్రతినిధిగా కేంద్రం వద్దకు వెళ్లాలని అమరావతి రైతులు పవన్ కల్యాణ్ ను కోరడానికి సిద్ధపడ్డారు. ఈ వార్త సమయానికి పవన్ కల్యాణ్ వారితో భేటీ కాలేదు. ఆయన కేంద్రం వద్ద రాజధాని రైతుల ప్రతినిధిగా వెళ్తారా, లేదా అనేది వేచి చూడాల్సిందే.

బిజెపితో జనసేన పొత్తు పెట్టుకోవడం వైఎస్ జగన్ కు ఈ రకమైన తలనొప్పిని తెచ్చిపెట్టింది. కేవలం ఎన్నికల కోసమే కాకుండా జగన్ ను కౌంటర్ చేయడానికి అవసరమైన చర్యలకు పవన్ కల్యాణ్ దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తన్నారు. 

Also Read: జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

తాజాగా ఆయన మరో మాట కూడా అన్నారు. రాజధాని ఎక్కడికీ పోదని, అమరావతిలోనే ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్రం ఇచ్చిన భరోసాతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే జగన్ దాన్ని ఎలా ఎదుర్కుంటారనేది ప్రశ్నార్థకమే.