న్యూఢిల్లీ/ గుంటూరు: మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందేవరకు ఆగిన బిజెపి నేతలు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మూడు రాజధానుల ప్రతిపాదనపై తీవ్రంగా మండిపడ్డారు.  అమరావతిని ఉత్తుత్తి రాజధాని చేయాలని వైఎస్ జగన్ చూస్తున్నారని జీవీఎల్ నరసింహారావు అన్నారు.

కేంద్రంతో మాట్లాడే జగన్ ఇదంతా చేస్తున్నారనేది దుష్ప్రచారమని, జగన్ నిర్ణయంతో కేంద్రానికి ఏ విధమైన సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రానికి ఆపాదించవద్దని ఆయన అన్నారు.  కేంద్రం పెద్దనన్న పాత్ర పోషించాలని అనడం టీడీపీ అధినేత చంద్రబాబు చేతకానితనమని ఆయన అన్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు ఓ మిథ్య అని ఆయన అన్నారు.

కర్నూలులో హైకోర్టు పెట్టి రాజధాని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో ఐదేళ్లలో చంద్రబాబు నాలుగు భవనాలు కూడా కట్టలేదని విమర్శించారు.  స్వార్థ ప్రయోజనాల కోసమే వైఎస్ జగన్ రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ జగన్ సమర్థించుకోలేకపోతున్నారని అన్నారు. జనసేనతో కలిసి త్వరలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని అన్నారు.

చంద్రబాబుతో విసిగిపోయి ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ప్రజలు అధికారం అప్పగించారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధాని మార్పునకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని ఆయన అన్నారు.   రాజధాని మార్పునకు ఖర్చు ఒక్కటే కారణం కాదని ఆయన అన్నారు. భూదందాల కోసమే రాజధానిని మారుస్తున్నారని ఆయన అన్నారు. జగన్ ను ప్రజలు తుగ్లక్ అనుకుంటారని ఆయన అన్నారు. రాజధాని మార్పునకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కన్నా చెప్పారు.