విజయవాడ కమీషనరేట్ పరిధిలో 2018 కంటే ఈఏడాది 15 శాతం క్రైం రేట్ తగ్గిందని కమీషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.  అలాగే 2019 కంటే 12 శాతం కేసులు తగ్గినట్లు వెల్లడించారు. ఇక కోవిడ్ కేసులు కూడా అధికంగా నమోదయ్యాయన్నారు. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4శాతం క్రైం రేట్ తగ్గిందని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే రికవరీ శాతం కూడా పెరిగినట్లు సిపి వెల్లడించారు.

మర్డర్ ఫర్ గెయిన్స్ పెరిగాయన్నారు సిపి. నగరంలో చోరీలపై మరింత దృష్టి సారిస్తామని... గత ఏడాదితో పోల్చితే 29 శాతం రికవరీ పెరిగిందన్నారు. సైబర్ క్రైమ్ కేసులు పెరగగా మహిళలపై నేరాల శాతం గణనీయంగా తగ్గాయన్నారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టంని మరింత మెరుగుపరిచామనని సిపి వెల్లడించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 300 మందిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వారిని నిత్యం గమనిస్తున్నామన్నారు. ఉయ్యురులో జరిగిన చోరీ కేసులో 60 శాతం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. పటమటలో జరిగిన గ్యాంగ్ వార్ లో 31 మందిని అరెస్ట్ చేసామన్నారు సిపి.

 మహిళా మిత్ర కమిటీలు పెట్టామని... మహిళలు, పిల్లలు, కుటుంబ సమస్యలపై మహిళా మిత్ర నిత్యం మానిటరింగ్ చేస్తుందన్నారు. సైబర్ మిత్రని మరింత మెరుగు పరుస్తామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా వుండాలని... యాప్ ల నుంచి లోన్స్ తీసుకోవద్దని సూచించారు. నగరంలో 3 విడతలుగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు సిపి తెలిపారు. యాంటీ డ్రగ్ పై నగరంలో అనేక ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో నగరానికి చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. కోవిడ్ సమయంలో 383 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారని...వీరిలో ఇద్దరు కానిస్టేబుల్స్ చనిపోయారన్నారు. కోవిడ్ సమయంలో పోలీస్ శాఖ తరపున అనేక సేవాకార్యక్రమలు చేపట్టామని సిపి అన్నారు.