అందుకే దూరం పెట్టేశారు

First Published 29, Nov 2017, 4:14 PM IST
This why naidu was ketp at bay from Hyderabad metro rail inauguration
Highlights
  • తెరవెనుక రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ సెల్ఫ్ మార్కెటింగ్ అంటే మొహం మొత్తే అందరూ కూడబలుక్కుని చంద్రబాబును దూరంగా ఉంచారని ప్రచారం జరుగుతోంది.

అందుకే చంద్రబాబునాయుడును దూరంగా పెట్టారు. హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన మెట్రో ఇనాగరేషన్, గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జిఇఎస్) కార్యక్రమాలకు చంద్రబాబుకు ఆహ్వానం అందని విషయం అందరికీ తెలిసిందే. ఏపి సిఎంకు ఆహ్వానం అందకపోవటానికి తెరవెనుక రాజకీయ కారణాలు ఏమైనప్పటికీ సెల్ఫ్ మార్కెటింగ్ అంటే మొహం మొత్తే అందరూ కూడబలుక్కుని చంద్రబాబును దూరంగా ఉంచారని ప్రచారం జరుగుతోంది.

తాజాగా చంద్రబాబు వరస చూస్తుంటే జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే, బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ, మెట్రో రైలు తన వల్లే వచ్చిందన్నారు. ఉమ్మడి ఏపిలో హైదరాబాద్ లో మెట్రో రైలు కోసం తాను ఎంతో పోరాటం చేశానని చెప్పారు. వైఎస్ వల్లే మెట్రో ఆలస్యమైందని కూడా అనేశారు. నిజానికి మెట్రో కోసం చంద్రబాబు చేసింది చాలా తక్కువ. హైదరాబాద్ కు మెట్రో అవసరం అని చెప్పింది, కొంత కసరత్తు మొదలైంది చంద్రబాబు హయాంలోనే. అంత వరకే జరిగింది.

మెట్రో ప్రాజెక్టు డిజైన్లు ఖరారవ్వటం, భూ సేకరణ ఊపందుకోవటం, నిర్మాణాలు మొదలవ్వటం లాంటివన్నీ వైఎస్ హయాంలో జరిగాయి. వైఎస్ మరణం తర్వాత కూడా పనులు బాగానే జరిగినా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం వల్ల మందగించింది. సరే, చివరకు ఎలాగైతేనేం ప్రాజెక్టు ప్రారంభమైంది కెసిఆర్ హయాంలోనే. ఇక, రెండో అంశమైన గ్లోబల్ సదస్సు విషయం చూస్తే, జిఇఎస్ వేదికైన హెచ్ఐసిసి తానే నిర్మించానని చంద్రబాబు చెప్పారు. దాన్ని ఎవరూ కాదనలేరు.

ఇక, చివరగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా తానే నిర్మించానని చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదు. విమానశ్రయ నిర్మాణానికి భూ సేకరణ మాత్రమే చంద్రబాబు హయాంలో జరిగింది. నిర్మాణాలు మొదలై పూర్తయ్యింది వైఎస్ హయాంలోనే.

అన్నీ తానే చేశానని, ప్రతిదీ తానే నిర్మించానని ఒకటికి వెయ్యిసార్లు చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఏ దేశానికి వెళ్ళినా, అతిధులు ఎవరు చంద్రబాబును కలిసినా వాళ్ళ దగ్గర కూడా అరిగిపోయిన రికార్డే. ఈ విషయాలు ప్రధానమంత్రి నరేంద్రమోడి, తెలంగాణా సిఎం కెసిఆర్ కు బాగా తెలుసు. అందుకనే చంద్రబాబును రెండు కార్యక్రమాలకూ దూరంగా పెట్టేసారనే ప్రచారం నిజమే అనిపిస్తోంది.

 

loader