విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైయస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతుంది. 

వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వైయస్ జగన్ తండ్రి, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎన్నికల హామీపై తొలిసంతకం పెట్టడం సాంప్రదాయంగా ప్రకటించేవారు. 

అయితే అదే పద్ధతిలో జగన్ పయనిస్తారని ప్రచారం జరింగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తొలిసంతకం అంటూ ఏమీ లేదని స్పష్టం చేశారు. నవరత్నాలు అమలు చేయడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. 

ఇప్పటికే సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యంతోపాటు ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో సమీక్షలు సైతం నిర్వమించారు. ఈ నేపథ్యంలో జగన్ ముఖ్యమంత్రి హోదాలో కీలక ప్రకటన చేస్తారని టాక్. అయితే ఆ ప్రకటన ఏమై ఉంటుందా అని రాష్ట్రప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.