కాకినాడ: గోదావరి నదికి వరద పోటేత్తింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చాలా గ్రామాల్లో వరద నీటిలో ముంపుకు గురయ్యాయి. భద్రాచలం వద్ద గోదావరి నది 61 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురవడంతో వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దాదాపుగా నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మహారాష్ట్రలో కూడ భారీ వర్షాలు కురవడంతో గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏడేళ్ల తర్వాత భద్రాచలం వద్ద 61 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించడం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు. 

2013 ఆగష్టు 3వ తేదీన భద్రాచలం వద్ద గోదావరి 61.6 అడుగుల ఎత్తులో ప్రవహించింది. ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే ప్రథమం. భారీగా వరద నీరు రావడంతో గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరికను కూడ దాటి గోదావరి ప్రవహిస్తోంది. సోమవారం నాడు రాత్రికి భద్రాచలం వద్ద గోదావరి 63 అడుగులను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


గోదావరి నది చరిత్రలో రెండు సార్లు మాత్రమే 70  అడుగులు దాటింది. ఇప్పటివరకు  నాలుగు దఫాలు మాత్రమే 60 అడుగులు దాటినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

1976,1983, 2006,2013లో గోదావరి 60 అడుగులు దాటింది. 1986 ఆగష్టు 16న, గోదావరి 75.66 అడుగుల ఎత్తులో ప్రవహించింది.1990 ఆగష్టు 24న 70.8 అడుగుల ఎత్తులో ప్రవహించింది. 

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవహిస్తున్న నేపథ్యంలో రామాలయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్రంలోని గోదావరి లంక గ్రామాలు కూడ వరద నీటిలో మునిగిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని దవళేశ్వరం వద్ద 
18 లక్షల 93 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఇవాళ రాత్రికి మరో లక్ష క్యూసెక్కుల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

దేవీపట్నం, పోలవరం ,కూనవరం, వీఆర్ పురం,కుక్కునూరు, చింతూరు, ఏటపాక మండలాలు ముంపుకు గురయ్యాయి. దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకొన్నాయి. 

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు కూడ జలదిగ్భంధంలో ఉన్నాయి. యలమంచిలి,కనకాయలంక గ్రామం నీట మునిగింది. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆచంట, అయోధ్యలంక, మర్రిమూలలంక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.