స్కూల్లో మధ్యాహ్నభోజనం చేస్తున్న మూడో తరగతి విద్యార్థి మీద వీధికుక్క దాడి చేసింది. దీంతో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. 

నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో వీధికుక్కల దాడులు ఇంకా తగ్గడం లేదు. మనుషులు కనిపిస్తే చాలు దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్కూల్లో అన్నం తింటున్న విద్యార్థి మీద వీధికుక్క దాడిచేసింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు చెన్నంపల్లిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.

మూడో తరగతి విద్యార్థి సంజయ్ మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలో చేస్తుండగా వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం పామూరు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఒంగోలుకు తీసుకువెళ్లారు. స్కూల్ వర్కింగ్ టైంలో గేట్లు ఎందుకు తెరిచి పెట్టారంటూ ఉపాధ్యాయులపై స్థానికులు ఈ ఘటన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రామకుప్పంలో చంద్రబాబు పీఏతో పాటు 45 మందిపై కేసు నమోదు..

అయితే దీనికి తమ నిర్లక్ష్యం కారణం కాదని.. రెప్పపాటులో జరిగిపోయిందంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏం శోభన్ బాబు తెలిపారు. స్కూల్లో మొత్తం 31 మంది విద్యార్థులు ఉన్నారని వీరిలో 30 మంది మధ్యాహ్న భోజనం చేస్తారని తెలిపారు. సంజయ్ భోజనం చేస్తున్న సమయంలో.. తాను కూడా భోజనం చేద్దామని గదిలోకి వెళ్లానని.. రెప్పపాటులో వీధి కుక్క అతడు మీద దాడి చేసి పారిపోయిందని తెలిపారు.

ఇదిలా ఉండగా, జూన్ 20న కర్నూలులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కనిపించిన వారిని కనిపించినట్లుగా కరుస్తున్నాయి. ఆ రోజు ఉదయం 9యేళ్ల శాన్వి అనే చిన్నాది మీద వీధికుక్కలు దాడి చేశాయి. చిన్నారి పారిపోతుంటే.. వెంటాడి మరీ దాడికి దిగాయి. ఈ దాడిలో శాన్వి తలకు, మెడకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. 

మూడు కుక్కలు వెంటపడి, వేటాడి దాడి చేయడంతో భయంతో, బాధతో ఆ చిన్నారి పెడుతున్న అరుపులు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ టీవీలో నమోదయ్యింది. చిన్నారి అరుపులు విని అప్రమత్తమైన స్థానికులు.. వెంటనే కుక్కలను తరిమేయడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. 

మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో నిహాల్ అనే 11యేళ్ల బాలుడి మీద వీధికుక్కలు దాడిచేసి చంపేశాయి. అదే ప్రాంతంలో మరో బాలిక కుక్కల దాడిలో గాయపడింది.ఈ వరుస ఘటనలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల విషయంలో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.