విశాఖ : దొంగలపై తిరగబడ్డ మహిళలు, దుండగుల రాళ్లదాడి.. వృద్ధురాలికి తీవ్రగాయాలు
విశాఖ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తమను అడ్డుకున్న మహిళలపై రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. అయితే పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
విశాఖ జిల్లాలో (visakhapatnam) మహిళలు అపర కాళికలుగా మారారు. దొంగతనానికి వచ్చిన యువకులపై తిరగబడ్డారు. అయితే వీరిని ప్రతిఘటించే క్రమంలో మహిళలపై పెద్ద బండరాయి విసిరారు దుండగులు. తమ ఇంటి ముందు మామిడిచెట్టు వద్ద దొంగల అలికిడితో మహిళలు అప్రమత్తమయ్యారు. దొంగతనంతో పాటు మామిడికాయలనూ ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 2 గంటల సమయంలో జరిగిన ఘటన, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే దీనిపై పోలీసులు స్పందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిపోతూ పారిపోతూ పెద్దరాయిని మహిళల తలపై విసిరాడు ఓ యువకుడు. అయితే అది గురితప్పి తలకు బదులు కాలుకి తగలడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనలో గంగలక్ష్మి (60) అనే వృద్ధురాలి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరిగి అల్లాడుతున్న మహిళపై కరుణ లేకుండా, నిందితులను అరెస్ట్ చేయడంలో ఖాకీల అలసత్వం ప్రదర్శిస్తుండటంతో స్థానికులు భగ్గుమంటున్నారు.
దొంగతనానికి వచ్చిన వారిని వెంకోజిపాలేనికి చెందిన కల్లేపల్లి వాసు, లోకేశ్ సహా మొత్తం నలుగురిని గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన కరువైంది. దీంతో నేరుగా ఫిర్యాదు చేశారు బాధితులు. అయినప్పటికీ వీరిని పట్టించుకోకపోవడంతో జనం మండిపడుతున్నారు. ఇంటి యజమాని గంగలక్ష్మికి న్యాయం చేయాలని కుటుంబసభ్యుల డిమాండ్ చేస్తున్నారు. రాయి కాలికి బదులు తలకు తగిలుంటే తమ పరిస్థితి ఏంటని గంగలక్ష్మి కూతుళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అల్లరి మూకల ఆటకట్టించాలని, పోలీసులు వెంటనే స్పందించే వ్యవస్థ కావాలని విశాఖ వాసులు కోరుతున్నారు. హైవేకి పక్కనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పెట్రోలింగ్ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.