హోటల్ లో చోరీకి వచ్చి.. ముందు కూల్ డ్రింక్ తాగి, నడుం వాల్చి.. ఆపై నగదు దొంగతనం...
ప్రకాశం జిల్లాలో ఓ విచిత్రమైన దొంగతనం వెలుగు చూసింది. హోటల్ లో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ కూల్ డ్రింక్ తాగి, విశ్రాంతి తీసుకున్నాడు. అది చూసిన పోలీసులు అవాక్కయ్యారు.

ప్రకాశం : గుట్టు చప్పుడు కాకుండా దొంగతనానికి పాల్పడి.. చడీ చప్పుడు కాకుండా అక్కడ నుంచి జారుకుంటారు దొంగలు. ఇది మామూలుగా అందరూ దొంగలు చేసే పనే. కానీ, కొంతమంది.. సిగ్నేచర్ దొంగలు ఉంటారు. దొంగతనం తామే చేశామని తెలిసేలా కొన్ని గుర్తులు వదిలి వెళుతుంటారు. దీన్ని బట్టి పోలీసులు దర్యాప్తు సమయంలో ఏ ముఠా దొంగతనం చేసిందో కనిపెట్టేస్తారు. కానీ పట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఇదంతా కరుడుగట్టిన దొంగల ముఠాల సంగతి.
ఇక అప్పుడప్పుడు చేతివాటం చూపించే దొంగలు కూడా ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. అలాంటి ఘటనే ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటుచేసుకుంది. హోటల్ లలో దొంగతనానికి వచ్చిన ఓ దొంగ.. ముందుగా దుకాణాల్లో ఉన్న కూల్ డ్రింకును తాగి సేద తీరాడు. ఆ తరువాత కాసేపు అలా నడుం వాల్చాడు. ఈ పనులన్నీ అయిన తర్వాతే నగదు కౌంటర్ జోలికి వెళ్ళాడు. కౌంటర్ లో ఉన్న రూ.1.35 లక్షలతో పారిపోయాడు. ఈ సంఘటన కనిగిరి పట్టణంలో చోటు చేసుకుంది. అక్కడి పామూరు బస్టాండ్ లో ఉన్న నక్షత్ర, మినర్వా హోటల్ దగ్గర గురువారం తెల్లవారుజామున జరిగింది.
నక్షత్ర,మినర్వా హోటళ్ల యజమాని షేక్ ఖాజా బుధవారం రాత్రి రోజూలాగే హోటల్ లకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున నక్షత్ర హోటల్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ.1.20 లక్షల నగదును చోరీ చేశాడు. దీంతో అలసిపోయాడో ఏమో.. ఫ్రిజ్లో ఉన్న కూల్ డ్రింక్ తీసుకున్నాడు. అది తాగేసి కాసేపు విశ్రాంతి కూడా తీసుకుని.. పక్కనే ఉన్న మినర్వా హోటల్ లో చోరీకి ప్రయత్నించాడు.
మినర్వా హోటల్ తలుపులు పగలగొట్టి.. లోపలికి ప్రవేశించాడు. ఆ హోటల్లో ఉన్న నగదు కౌంటర్ లోని రూ.15వేలు తీసుకొని పరారయ్యాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే, దొంగ కాసేపటి తర్వాత సీసీ కెమెరాలు ఉన్న విషయాన్ని గమనించి వాటిని గోడ వైపుకు తిప్పేశాడు. దీంతో కొంతవరకు మాత్రమే కెమెరాల్లో రికార్డయింది. ఉదయం హోటల్ తెరవడానికి వచ్చిన యజమాని చోరీ జరిగిన సంగతి గమనించి పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ మాధవరావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.