ఇంట్లో నలుగురం నాలుగు దిక్కులయ్యాం.. దేవాన్ష్ తాతను అడిగితే , విదేశాలకు వెళ్లాడని చెప్పాం : నారా భువనేశ్వరి
తన మనవడు దేవాన్ష్ తాత ఎక్కడ అని అడిగితే.. మేం విదేశాలకు వెళ్లాడని చెప్పాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి . ఇంట్లో వున్న నలుగురరం నాలుగు దిక్కులు అయ్యామని , ఒక్కదాన్నే తిరుమలకు వెళ్తే చాలా బాధగా అనిపించిందన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి జనంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ‘‘నిజం గెలవాలి ’’ అనే పేరుతో ఆమె యాత్ర చేస్తున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారిని ఆమె పరామర్శిస్తూ, సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.
తాజాగా భువనేశ్వరి మాట్లాడుతూ.. తన మనవడు దేవాన్ష్ తాత ఎక్కడ అని అడిగితే.. మేం విదేశాలకు వెళ్లాడని చెప్పాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోని డబ్బు ఏ ఖాతాకు వెళ్లింది అని మాత్రం చెప్పడం లేదని.. ప్రజల సొమ్ము మా కుటుంబానికి అక్కర్లేదన్నారు. సీఐడీ ఎప్పుడైనా వచ్చి విచారించుకోవచ్చని.. ములాఖత్‌లో తమకు ఇచ్చే సమయం 30 నిమిషాలని.. అందులో 25 నిమిషాలు ప్రజలు, పార్టీ గురించే చంద్రబాబు అడుగుతారని భువనేశ్వరి తెలిపారు.
ALso Read: నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు ఇంకా ఇరుక్కుంటారు : భువనేశ్వరి యాత్రపై మంత్రి అంబటి సెటైర్లు
చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలని ఇలా చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నుంచి పౌరుషం.. చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నానని భువనేశ్వరి తెలిపారు. ఎన్నడూ బయటకు రాని మహిళలు కూడా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే అది చంద్రబాబుపై వున్న నమ్మకమన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల చేసిన లేఖపైనా విచారణ అంటే తమకు ఆశ్చర్యంగా వుందన్నారు.
చంద్రబాబు తినే ఆహారంలో మేం విషం కలుపుతున్నామని అంటున్నారని.. వారి ఆలోచన అంతహీనంగా వుందని భువనేశ్వరి దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాలాగానే ఆలోచిస్తున్నారని.. అందుకే రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. ఒక్కదాన్నే తిరుమలకు వెళ్తే చాలా బాధగా అనిపించిందని.. ఇంట్లో వున్న నలుగురరం నాలుగు దిక్కులు అయ్యామని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను చంద్రబాబు అభివృద్ధి చేశారని.. ప్రతి జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దారని ఆమె తెలిపారు. హింస, కేసులు, భయపెట్టడంతో ఏపీ నెంబర్‌వన్‌గా మారిందని భువనేశ్వరి ఎద్దేవా చేశారు. తన కోసం చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించాలని చంద్రబాబు చెప్పారని ఆమె పేర్కొన్నారు.