దొంగలు రాను రాను తెలివి మీరుతున్నారు. పోలీసులు కనిపెట్టకుండా జాగ్రత్తలు పడటంతో పాటు దొంగతనానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు.

తాజాగా బిచ్చగాళ్ల ముసుగులో దొంగతం చేస్తున్న ఓ ముఠా సీసీ కెమెరాకు చిక్కింది. స్థానిక లీలా మహల్‌ సెంటర్‌ కూడలిలోని లక్ష్మీవెంకటేశ్వర స్టీల్‌ దుకాణంలోకి ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లల్ని వెంటేసుకుని వచ్చారు.

నేరుగా దుకాణంలోని వ్యక్తి దగ్గరకు వచ్చి దానం చేయాలంటూ చేయిచాచారు. దుకాణం యజమాని ఏదో సర్ది చెప్పబోతున్నా వదల్లేదు. వెంటనే ఇద్దరు మహిళలు అతన్ని చుట్టుముట్టి యజమానిని గందరగోళంలోకి నెట్టారు.

ఆ సమయంలో మహిళలతోపాటు వచ్చిన చిన్న పిల్లలు చేతివాటం ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ఇదంతా పక్కా ప్రణాళికతోనే చేసినట్లు పోలీసులు, దుకాణం యజమాని భావిస్తున్నారు.

మహిళలు యజమాని దృష్టిని మరల్చగానే పనికానిచ్చేలా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, రూ.1.5లక్షల విలువైన ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.