ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. విశాఖపట్నంలోని రిషికొండ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గంటా శ్రీనివాసరావు  కుమార్తె సాయి పూజిత కుటుంబం రుషికొండలోని బాలాజీ బేమౌంట్‌ విల్లాలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 10న ఆమె కుటుంబ సమేతంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అత్తవారింటికి వెళ్లి, తిరిగి 11న, తమ ఇంటికి కాకుండా.. ఎంవీపీ కాలనీలోని తండ్రి గంటా ఇంటికి వచ్చారు. 

ఏదో వస్తువు అవసరమవడంతో ఇంట్లో ఒకరిని విల్లాకు పంపించగా చోరీ విషయం బయటపడింది. రూ.పది లక్షల  విలువ చేసే బంగారం, డైమండ్‌ చెవిదిద్దులు, ఇతర వెండి వస్తువులు చోరీకి గురైనట్లు తేలింది. దీనిపై పాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. సాయి పూజిత ఇంట్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.