అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. రాజకీయ భవిష్యత్, కేసుల నుంచి ఎదుర్కోవడం, ఇలాంటి కారణాలు ఒక ఎత్తు అయితే మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎపిసోడ్ మరోకారణమని తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్న ఏకైక అంశం మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు అంశమే. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పనిచేస్తున్న తరుణంలో ఆయన తనయుడు కోడెల శివరామ్, కుమార్తె పూనాటి విజయలక్ష్మీలపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి.

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా,  అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న ముందుగా కోడెల తనయుడు శివరామ్ కు కే ట్యాక్స్ చెల్లించాలంటూ ఒక రూల్ ఉండేదని వార్తలు వినిపిస్తున్నాయి.  

కే ట్యాక్స్ చెల్లిస్తేనే ఏ పనులకైనా అనుమతులు ఉండేవని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడెల శివరామ్ పై పలువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. ఇప్పటి వరకు పదికిపైగా కేసులు నమోదు కాబడ్డాయి. 

ఇకపోతే కోడెల శివప్రసాదరావు తనయ పూనాటి విజయలక్ష్మీ సైతం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. ఒక ప్రైవేట్ ఆస్పత్రికి ఎన్టీఆర్ వైద్యసేవ సదుపాయం కల్పిస్తానని డబ్బులు తీసుకోవడం, ఉద్యోగం వేయిస్తానని డబ్బులు తీసుకున్నారంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు పలువురు బాధితులు. 

గత 15రోజులుగా కోడెల శివప్రసాదరావు తనయుడు, తనయలపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకావడం, మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న తరుణంలో టీడీపీకి చెందిన నేతలు ఒక్కరూ స్పందించడం లేదు. 

సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉండగానే కేసులు నమోదు అయినా వాటిపై స్పందించలేదు. ఇకపోతే గుంటూరు జిల్లాలో మాజీమంత్రులు ఉన్నప్పటికీ కోడెల కేసులపై నోరు మెదపలేదు. 

టీడీపీ నేతలు దాదాపుగా సహాయ నిరాకరణ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కేవలం కోడెల శివప్రసాద్ మాత్రమే ప్రెస్మీట్ పెట్టి స్పందించారు కానీ ఏ ఒక్కరూ ఖండించలేదు. వారికి కనీసం మద్దతు ప్రకటించలేదు సరికదా పలకరించిన పాపాన పోలేదు. 

ఈ పరిస్థితులే టీడీపీలో చాలా మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట. భవిష్యత్ లో తమపై ఇలాంటి ఆరోపణలతో కేసులు నమోదు అయితే తమను ఎవరు కాపాడతారంటూ మదనపడుతున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారట. 

ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ ఇప్పటికే డోర్స్ క్లోజ్ చేసేశారు. తమ పార్టీలోకి రావాలనుకునేవారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ కండీషన్స్ అప్లై చేస్తున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగానే టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు ముందుగా బీజేపీలో చేరారని తెలుస్తోంది. 

భవిష్యత్ లో ఈ ఫిరాయింపుల ప్రక్రియ అసెంబ్లీ వరకు ఉంటుందని కూడా ప్రచారం జరుగుతోంది. మెుత్తానికి కోడెల శివప్రసాదరావు ఎపిసోడ్ తో తెలుగుదేశం పార్టీ నాయకులు అలర్ట్ అయ్యారనేది మాత్రం వాస్తవమంటూ ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.