Asianet News TeluguAsianet News Telugu

సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి తమ పార్టీతో సంబంధం లేదు - జనసేన

ఏపీ సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి తమ పార్టీతో ఎలాంటి సంబంధమూ లేద‌ని జ‌న‌సేన స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు శ‌నివారం ఓ ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించద‌ని తెలిపింది.

The man who posted that he would kill the CM has nothing to do with their party - Janasena
Author
Amaravathi, First Published Jan 22, 2022, 4:03 PM IST

ఏపీ సీఎంను చంపుతానని పోస్టు చేసిన వ్యక్తికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేద‌ని జ‌న‌సేన (janasena) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు శ‌నివారం ఓ ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. సోషల్ మీడియా (social media) లో తప్పుడు పోస్టులు చేసేవారిని జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించద‌ని తెలిపింది. స‌మాజంలో హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుంద‌ని పేర్కొంది. 

జ‌న‌సేన పార్టీ సానుభూతిపరుడు, పార్టీ అధ్య‌క్షుడి అభిమాని అనే ముసుగులో తప్పుడు పోస్టులు చేసేవారి పట్ల నాయకులు, జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నామ‌ని తెలిపింది.సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించాలని, వాస్తవిక, విశ్లేషణాత్మక‌మైన దృక్పథంతో, స‌మాజంలో ఆలోచన కలిగించేలా, చైతన్యపరచే విధంగా పోస్టులు ఉండాలని జనసేన పార్టీ అభిలాషిస్తుంద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

ఏం జ‌రిగిందంటే.. 
ఈ నెల 16న ట్విట్ట‌ర్ (twitter)లో కన్నాభాయ్ అనే అకౌంట్ నుంచి ఓ వ్య‌క్తి  ‘మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని’ పోస్ట్ చేశారు. అయితే వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడంతోపాటు ట్విటర్ అకౌంట్ మూసేశాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ విష‌యంలో పోలీసుల‌కు ఫిర్యాదు అంద‌డంతో అత‌డిని వెతికేందుకు రంగంలోకి దిగారు. పెరిగిన టెక్నాల‌జీ సాయంతో పోస్ట్ చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకున్నారు. అయితే నిందితుడు రాజమహేంద్రవరానికి చెందిన రాజ పాలెం పవన్ ఫణి గా గుర్తించారు. అతడు హైదరాబాదులోని ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఈ కేసు వివరాలను సైబ‌ర్ క్రైమ్ డీఎస్పీ రాధిక (dsp radhika) మీడియాకు శుక్రవారం వెల్లడించారు. సీఎంను చంపుతాన‌ని ట్విట్ట‌ర్ లో పోస్టు చేసిన వ్య‌క్తి రాజమహేంద్రవరానికి చెందిన రాజ పాలెం పవన్ ఫణి గా గుర్తించామ‌ని అన్నారు. అత‌డు ఓ సంస్థలో సేల్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడని ఆమె తెలిపారు. పవన్ కల్యాణ్ వీరాభిమానినని విచారణ సమయంలో తెలిపినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని హతమారిస్తే ప్రభుత్వం కూలిపోతుందని విద్వేషపూరిత పోస్టులు పెట్టినట్లు నిందితుడు వాంగ్మూలం పేర్కొన్నాడు. పోస్ట్ చేసిన వెంట‌నే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా.. టెక్నాల‌జీ సాయంతో నిందితుడు ఆచూకీ క‌నిపెట్టి అదుపులోకి తీసుకున్నామ‌ని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చట్ట వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్ చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ విభాగం హెచ్చరించింది. తప్పుడు ఖాతాల ద్వారా పోస్టింగ్ లు చేసి ఆ తరువాత డిలీట్ చేసినా నిందితులు తప్పించుకోలేరని తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios