ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరుగున పడిపోయిందని  రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం మ‌రుగున ప‌డిపోయింద‌ని టీడీపీ (tdp) రాజ్య‌స‌భ ఎంపీ క‌న‌క‌మేడ‌ల రవీంద్ర కుమార్ (kanakamedala ravidndra kumar) అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు సభ్యులతో సబ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించి తెలిపారు. అయితే హోంశాఖ ద్వారా విడుదల చేసిన నోట్ లో ప్రత్యేక హోదాతో సహా 9 అంశాల ఉండటంతో వైఎస్ఆర్ సీపీ (ysrcp) నాయకులు హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) తుంగలో తొక్కిన అంశాన్ని త‌మ సీఎం వెలుగులోకి తెచ్చారంటూ తిట్టిపోశార‌ని అన్నారు. 

కమిటీ ఎందుకు నియమించార‌ని విష‌యం మ‌ర్చిపోయి సీఎం జ‌గ‌న్ (cm jagan), ప్రధాని మోదీ (prime minister modi)ని కలిసినందు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందని కీర్తించార‌ని తెలిపారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినంత ఫీల్ అయ్యామ‌ని అన్నారు. కానీ 4 గంటలు కాకుండానే మళ్లీ సీన్ రివర్స్ అయ్యింద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌త్యేక హోదా అంశంతో పాటు వెనుకబడిన జిల్లాల అంశాలన్నీ మరుగునపడ్డాయ‌ని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న పదేళ్ల కాల వ్యవధిలో 8 ఏళ్లు గ‌డిచిపోయాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరుబాట పట్టార‌నీ, కానీ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో మాత్రం స్పంద‌న లేద‌ని అన్నారు. 

జనవరి 3న ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 14 పేజీల వినతి పత్రాన్ని తాము చూశామ‌ని తెలిపారు. కానీ అందులో ప్రత్యేక హోదా అంశం లేద‌ని చెప్పారు. ఆ లేఖ‌లో హోదా అంశం ఎందుకు పెట్టలేదని ప్ర‌శ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ (telangana) ప్రభుత్వం ఎప్పుడో చెప్పింద‌ని స్ప‌ష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన మొద‌ట్లో ఇద్ద‌రు సీఎంలు స‌న్నిహితంగా మెలిగార‌ని, దీంతో అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయ‌ని అంద‌రూ అనుకున్నార‌ని తెలిపారు. కానీ తెలంగాణ సీఎం, మంత్రుల వ్యాఖ్య‌లు చూస్తే దానికి భిన్నంగా క‌నిపిస్తున్నాయ‌ని అన్నారు. గతంలో ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణలో 4 ఎకరాలు వచ్చేవని కానీ ప్ర‌స్తుతం సీన్ రివ‌ర్స్ అయ్యింద‌ని అంటున్నార‌ని తెలిపారు. ఏపీలో ఉన్న ప‌రిస్థితులు తెలంగాణకు బాగా అనుకూలించాయని హరీష్ రావు (harish rao)తో పాటు మిగితా మంత్రులు అంటున‌నార‌ని అన్నారు. అయితే వాళ్లు పొగిడారో, వెట‌కారంగా అన్నారో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. 

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత, కుట్రపూరిత, రాజకీయ ప్రేరేపిత విధ్వసం వ‌ల్ల ఏపీ పాతిక సంవత్సారాలు వెనక్కి పోయిందని అన్నారు. అన్నిచోట్లా అవమానాలు, చులకనలు ఎదురువుతున్నాయ‌ని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం చొరవతో, మంచి సుహృద్బావ వాతావరణంలో, విభజన సమస్యలు పరిష్కారం అవుతాయని, దానికి రెండు రాష్ట్రాల సీఎంలు స‌హ‌క‌రిస్తార‌ని ఆశిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. అలాగే కృష్ణా గోదావరి జలాల పంపిణీ సమస్యలు, విద్యుత్ బకాయిలు-ఉద్యోగుల సమస్యలు, ఆస్తుల పంపకాల సమస్యలు ప‌రిష్క‌రించి, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్నామ‌ని తెలిపారు.