నెల్లూరు: ఓ హత్య కేసును ఛేదించడానికి పోలీసులకు తొలుత ఏ విధమైన క్లూ కూడా లభించలేదు. అయితే, ఆటో రిక్షాపై అతికించిన సూపర్ స్టార్ రజనీకాంత్ స్టిక్కర్ కేసును ఛేదించడానికి ఉపయోగపడింది. 

దాని సాయంతో నెల్లూరులోని అరవింద నగర్ కు చెందిన నిందితుడు వేవసాని శ్రీకాంత్ అలియాస్ రజనీకాంత్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలలుగా ఆమెతో అతను సంబంధం నెరుపుతున్నట్లు తెలుస్తోంది.  అయితే, మే 28వ తేదీన నిర్మల అనే ఆ మహిళ సజీవదహనమైంది.  గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసి పడి ఆమె మరణించిందని పోలీసులు తొలుత భావించారు. 

పోస్టుమార్టమ్ నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆమె మెడపై కత్తితో పొడిచినట్లు నివేదికలో వెల్లడైంది. అయితే, పెనుగులాట జరిగిన దాఖలాలు ఏవీ కనిపించలేదు. దాంతో తెలిసిన వ్యక్తే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. 

సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, నిర్మల ఇంటి బయట ఓ ఆటో రిక్షా ఆగి ఉన్న విషయం బయటపడింది. దానిపై రజనీకాంత్ అనే స్టిక్కర్ అతికించి ఉంది. దాంతో ఆ స్టిక్కర్ ఉన్న ఆటో కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దాదాపు 10 వేల ఆటోలను పరిశీలించారు. చివరికి అపోలో ఆస్పత్రి ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆ ఆటో కనిపించింది.

వెంటనే పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఆటో రిక్షా శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిందని పోలీసులు గుర్తించారు. అతను రజనీకాంత్ అభిమాని. దాంతో ఆటో రిక్షాపై రజనీకాంత్ స్టిక్కర్ వేసుకున్నాడు. పైగా, తనను తాను రజనీకాంత్ గా పిలుచుకునేవాడు. 

విచారణలో శ్రీకాంత్ అసలు విషయం చెప్పాడు. ఆరు నెలలుగా ఆమెతో అఫైర్ నడుపుతున్నట్లు తెలిపాడు. బంగారం కోసం ఆమెను మె 28వ తేదీన కత్తి పొడిచినట్లు అంగీకరించాడు. తాను ఆ రోజు సాయంత్రం 7 గంటలకు నిర్మల ఇంటికి వెళ్లానని, ఆమె నిద్రపోయిన తర్వాత ఆమె ఛాతీపై కూర్చుని బటన్ నైఫ్ తో ఆమె మెడపై 15 సార్లు పొడిచానని విచారణలో చెప్పాడు. 

ఆ తర్వాత బంగారం గొలుసుని, నాలుగు గాజులను తీసుకున్నానని, చెవి రింగులను తీసుకోవడానికి చెవులను కోశానని చెప్పాడు.  కప్ బోర్డులో ఉన్న ఆమె పర్సులోని 2 వేల రూపాయలు తీసుకున్నానని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆమె శవంపై కాగితాలు వేసి మంట పెట్టినట్లు తెలిపాడు. ప్రమాదంగా సృష్టించడానికి గ్యాస్ సిలిండర్ వాల్వ్ ఓపెన్ చేసినట్లు తెలిపాడు. 

మృతురాలు బి నిర్మలా బాయి (45) ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ ఉండేది. ఆమె కుమారుడు బెంగళూరులో పనిచేస్తుండగా, కూతురు తిరుపతిలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తోంది.