గుంటూరు జిల్లా తాడికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంతపార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీకి నష్టం చేస్తున్నారంటూ కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు.

గుంటూరు: తాడికొండ (thatikonda) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysrcp)లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (undavalli sridevi) తీరును తప్పుబడుతూ ఆమెకు వ్యతిరేకంగా కొందరు వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు ఏకమయ్యారు. వీరంతా సోమవారం గుంటూరులోని ఓ పంక్షన్ హాల్ లో సమావేశమైన ఎమ్మెల్యేకు తీరును వైసిపి అదిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమావేశం. ఇలా సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేయడం ఎమ్మెల్యే శ్రీదేవికి రాజకీయంగా ఇబ్బందికరమే. 

ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వర్గంలో ఉండవల్లి జడ్పిటిసి, ఎంపిపి, ఎంపిటీసి, సర్పంచ్ లతో పాటు మరికొందరు కీలక నాయకులు, కార్యకర్తలు వున్నారు. పార్టీ కోసం కష్టపడివారికి కాకుండా కాసులు కుమ్మరించే వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు. పాలనలోనే కాదు పార్టీలోనూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేపై వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. 

వైసిపి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు ఎమ్మెల్యే నుండి వేదింపులు ఎదురవుతున్నాయని కొందరు నాయకులు బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు (ఎంపిపి) ఎంపికలో టిడిపితో కలిసి పనిచేసి అధికార పార్టీ సభ్యులను ఓడించిన వ్యక్తి నుండి ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని పదవి ఇచ్చేందుకు సిద్దమయ్యారని ఆరోపిస్తున్నారు. ఇలా కార్యకర్తల మనోభావాలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే పదవులను అమ్ముకోవాలని చూస్తున్నారని పలువురు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసారు. 

ఇక గ్రామాల్లోనూ పార్టీకి నష్టం చేకూర్చేలా రెండుమూడు గ్రూపులను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. అందకే అందరం ఏకతాటిపైకి వచ్చి పార్టీని కాపాడుకోవడమే కాదు ఎమ్మెల్యేతో తాడో పేడో తెల్చుకోడానికి సిద్దమయ్యామని అంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తెలిపింది.