ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విశ్వరూపం దాలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు పదివేల మార్కును దాటి ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తే ఎప్పుడూ ప్రజల్లో వుండే కొందరు ప్రభుత్వ అధికారులు ఈ వైరస్ బారిన పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇలా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తహాశీల్దార్ కరోనా బారిన పడ్డారు. 

కరోనా లక్షణాలు కనిపించడంతో ట్రూనాట్ వైద్యపరీక్ష నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ఆయన కుటుంబసభ్యులకు, కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వభించారు. ఇందులో ఆయన కుమారుడికి, ఓ వీఆర్వోకు కరోనా పాజిటివ్ గా తేలింది. 

కరోనా పాజిటివ్ గా తేలిన ఈ ముగ్గురిని వైద్యశాఖ అధికారులు ఏలూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీరికి వైఆర్‌డిఎల్ వైద్యపరీక్షలు నిర్వహించారు వైద్యులు. అంతేకాకుండా వీరి కుటుంబసభ్యులను, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. 

కరోనా విజృంభణ,  పూర్తిస్థాయి లాక్ డౌన్ సమయంలోనే కాకుండా ఇటీవల ఎమ్మార్వో, వీఆర్వో మండలకేంద్రంలోనే కాదు వివిధ గ్రామాల్లోనూ పర్యటించారు. దీంతో తాడేపల్లిగూడెం మండల పరిధిలోని ప్రజల్లో కలకలం మొదలయ్యింది. వీరు ఇటీవల కాలంలో ఎవరెవరితో కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్లారు అన్న వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 

read more   కరోనా మహమ్మారిపై ఉచిత ఆన్లైన్ కోర్సులు: కోవిడ్-19 ఏపీ నోడల్ ఆఫీసర్

మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 796 కేసులు నమోదయ్యాయి. ఇందులో 740 కేసులు రాష్ట్రానికి చెందినవి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 51 మందికి, విదేశాల నుంచి వచ్చినవారిలో ఐదుగురికి కొత్తగా కరోనా వైరస్ నిర్ధారణ అయింది. 

రాష్ట్రంలో మొత్తం 12,285 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ బారిన పడి 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణించినవారి సంఖ్య 157కు చేరుకుంది. 

గత 24 గంటల్లో కరోనావైరస్ నుంచి 263 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. తాజాగా గత 24 గంటల్లో కర్నూలు, కృష్ణా జిల్లాల్లో నలుగురేసి మరణించారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కరేసి మరణించారు. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,16,082 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 5289 మంది కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 6648 మంది చికిత్స పొందుతున్నారు. 

తాజాగా గత 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 161 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 84, తూర్పు గోదావరి జిల్లాలో 109, గుంటూరు జిల్లాలో 71, కడప జిల్లాలో 50 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 53, కర్నూలు జిల్లాలో 69, నెల్లూరు జిల్లాలో 24, ప్రకాశం జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాకు ఊరట లభించింది. ఈ జిల్లాలో కేసులేమీ నమోదు కాలేదు. 

విశాఖపట్నం జిల్లాలో 34, విజయనగరం జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 44 కేసులు నమోదయ్యాయి. తద్వారా రాష్ట్రంలో కొత్తగా 740 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 10,093కు చేరుకుంది. ఇతర రాష్టాల నుంచి వచ్చినవారిలో కొత్తగా 51 మందికి కరోనా వైరస్ సోకగా మొత్తం కేసుల సంఖ్య 1815కు చేరుకుంది. విదేశాల నుంచి వచ్చినవారిలో కొత్తగా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో మొత్తం సంక్య 377కు చేరుకుంది. 

జిల్లాలవారీగా మొత్తం కేసుల సంఖ్య, మరణాలు

అనంతపురం 1320, మరణాలు 7
చిత్తూరు 809, మరణాలు 6
తూర్పు గోదావరి 945, మరణాలు 7
గుంటూరు 1103, మరణాలు 17
కడప 683, మరణాలు 1
కృష్ణా 1252, మరణాలు 53
కర్నూలు 1684, మరణాలు 52
నెల్లూరు 561, మరణాలు 4
ప్రకాశం 272, మరణాలు 2
శ్రీకాకుళం 62, రణాలు 2
విశాఖపట్నం 461, మరణాలు 3
విజయనగరం 137, మరణాలు 1
పశ్చిమ గోదావరి 804, మరణాలు 2