తన కుమారుడు టీజీ భరత్ కూడా కర్నూలు సీటు ఆశిస్తున్నాడని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలిపారు. గురువారం ఆయన రాజధాని అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీకి చాలా ఇచ్చామని కేంద్రం అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. అసలు రాష్ట్రానికి ఏమి ఇచ్చారో  చెప్పాకే.. మోదీ ఏపీలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం వచ్చే ఎన్నికల్లో తన కొడుకు పోటీ చేయడం విషయంపై ఆయన స్పందించారు. కర్నూలు స్థానాన్ని కేఈ కుటుంబం కోరుకుంటున్నట్లు తనకు తెలిసిందని ఆయన అన్నారు. తన కుమారుడు భరత్ కూడా అదే సీటు కోరుకుంటున్నాడని చెప్పారు. టికెట్ ఎవరికి దక్కుతుందనే విషయం చంద్రబాబు చేతిలో ఉందన్నారు.

ఎవరికి గెలిచే సత్తా ఉంటే.. వారికి  చంద్రబాబు టికెట్ ఇస్తారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోట్ల, కేఈ కుటుంబాలు కలిసి పనియాల్సిన అవసరం ఉందన్నారు.