బర్త్ వే వేడుకలకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఆ యువకులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఏపీలోని లింగాల ప్రాంతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. ఇదే ఘటనలో ఓ మధ్య వయస్కుడు కూడా మరణించారు.
అంతసేపు స్నేహితుడి బర్త్ డే వేడుకల్లో వారు ముగ్గురు ఎంతో ఆనందంగా గడిపారు. ఓ స్నేహితుడిని తన ఇంటి వద్ద వదిలేసి వద్దామనే ఆలోచనతో వారు ముగ్గురు బైక్ పై బయలుదేరారు. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత ఆ బైక్ మరో బైక్ తో ఢీకొంది. దీంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో స్నేహితుడికి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరో బైక్ పై వస్తున్న మధ్య వయస్కుడు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని లింగాల ప్రాంతంలో జరిగింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డి రాహుల్ కుమార్ రెడ్డి (19)ది లింగాల మండలం కామసముద్రం గ్రామం. అతడికి పులివెందుల మండలంలో జల్లం గోవర్థన రెడ్డి (18), చరణ్ రెడ్డి అనే స్నేహితులు ఉన్నారు. అయితే బుధవారం పులివెందుల పట్టణానికి చెందిన మరో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం ఈ ముగ్గురు స్నేహితులు బైక్ పై కలిసి వెళ్లారు. వేడుకలు పూర్తి అయిన వెంటనే రాహుల్ కుమార్ రెడ్డిని ఇంటి వద్ద విడిచిపెట్టి రావడానికి మిగితా ఇద్దరూ స్నేహితులు తోడుగా వెళ్లారు. అంటే ముగ్గురు కలిసి బైక్ పై కామసముద్రాలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే పులివెందుల పట్టణానికి చెందిన మహబూబ్ బాషా (55) అనే వ్యక్తి లింగాల మండలం నుంచి తిరిగి ఇంటికి స్కూటర్ పై బయలుదేరారు.
ఈ క్రమంలో ఈ రెండు బైక్ లు లింగాల పరిధిలోని చిన్నాకుడాల విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహబూబ్ బాషా , రాహుల్ కుమార్ రెడ్డి, గోవర్థన రెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. చరణ్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని వెంటనే కడప గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.
ఇదిలా ఉండగా.. జగిత్యాల జిల్లాలో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయారు. ఆయన కూతురు వివాహం నేడు జరగాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బైన నర్సయ్య తన కూతురు పెళ్లికి కావాల్సిన వస్తువులు, కూరగాయల కోసం బైక్ పై మార్కెట్ కు వెళ్లాడు.
కూరగాయలు తీసుకుని వస్తుండగా ఘోరం జరిగింది. నర్సయ్య బైక్ మెళ్లిగా వస్తుండగా జాబితాపూర్ పెట్రోల్ పంప్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ క్రమంలోనే ఓ కారు వేగంగా వచ్చి నర్సయ్య ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో నర్సయ్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నర్సయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతడి వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఆనందోత్సాహాలతో కళకళలాడుతున్న ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొంది. కూతురు పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఇలా తండ్రి మృతిచెందడంతో తిరుమలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన పెళ్లి ఏర్పాట్లు చేస్తూ తండ్రి మృతిచెందడంతో ఆ ఆడకూతురు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పెళ్లి చేసుకుని ఆనందంగా కొత్తజీవితం ప్రారంభించాల్సిన అమ్మాయి ఇలా తండ్రి కోసం కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది
