అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే  ఈ విషయమై లిఖితపూర్వకంగా తమకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై గురువారం నాడు ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విషయమై విచారణ సందర్భంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలపాలని  ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

also read:టెన్త్ పరీక్షలపై తర్వాత చెబుతాం: హైకోర్టుకు ఏపీ సర్కార్‌

ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుండి  రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలు టెన్త్ పరీక్షలను రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాలు వాయిదా వేశాయి. అయితే  టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.అయితే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. దీంతో పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. ఈ తరుణంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనే అభిప్రాయంతో విద్యశాఖాధికారులున్నారు. ఇదే విషయాన్ని ఇవాళ హైకోర్టుకు తెలిపారు.

ఇవాళ క్యాంప్ కార్యాలయంలో సీఎం విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. టెన్త్ పరీక్షలపై ఆయన అధికారులతో చర్చించారు. కర్ఫ్యూ సమయంలో పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని  భావించారు. కరోనా కేసులు, కర్ఫ్యూ వంటి అంశాలను పరిశీలించి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇప్పట్లో స్కూల్స్ తెరిచే ఆలోచన లేదని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. 

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గిన తర్వాత జూలై మాసంలో  సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల మాదిరిగానే టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని  ఏపీ ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామని ఏపీ సీఎం జగన్ ఇదివరకే ప్రకటించారు.