దేశంలో పరిస్ధితి చక్కబడాలంటే కనీసం ఏడాది పడుతుందని ఓ వైపు ఆర్ధిక నిపుణులు స్పష్టగా చెబుతున్నారు.

ప్రజల సహనం చచ్చిపోతోంది. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే ఎక్కడ చూసినా ధర్నాలు, బ్యాంకుల సిబ్బందిని నిర్భందించటాలు. కొన్ని చోట్లైతే బ్యాంకులపైకి దాడులు కూడా మొదలయ్యాయి. ఒక్క 2 వేల రూపాయల కోసం సామాన్యుడు బ్యాంకులు, ఏటిఎంల ముందు గంటల తరబడి నిలబడుతున్నా ఉపయోగం కనబడటం లేదు.

పెద్ద నోట్ల రద్దై ఇప్పటికి 38 రోజులైనా పరిస్ధితులు కుదుట పడుతున్న దాఖలాలు కనబకపోగా మరింత విషమిస్తున్నాయి. దాంతో మరో 12 రోజుల్లో ఏదో అద్భుతం జరిగుతుందని జనాలెవరూ అనుకోవటం లేదు.

ఎందుకంటే దేశంలో పరిస్ధితి చక్కబడాలంటే కనీసం ఏడాది పడుతుందని ఓ వైపు ఆర్ధిక నిపుణులు స్పష్టగా చెబుతున్నారు. మరోవైపు ప్రధాని, ఆర్ధికమంద్రి అరుణ్ జైట్లీల మాటలు కోటలు దాటుతున్న వైనాన్నీ ప్రజలు బాగానే గమనిస్తున్నారు. 

డబ్బుల కోసం క్యూలైన్లలో నిలబడ్డవారిలో ఇప్పటికి రాష్ట్రంలోనే కనీసం 22 మంది మృత్యువాతపడ్డారు. అందుకనే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అమరావతి ఎస్బిఐ శాఖ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు వృద్ధులు, మహిళలు గాయపడ్డారు.

కడపజిల్లా ఒంటిమిట్టలో బ్యాంకుపైకి ఖాతాదారులు రాళ్ళు విసిరి అద్దాలను పగులగొట్టారు. చిత్తూరు జిల్లాలో అయితే పలు బ్యాంకుల సిబ్బందిని జనాలు నిర్భందించారు. ఇక, రాష్ట్రం మొత్తంలోని బ్యాంకుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు సాధారణమైపోయాయి.

నవంబర్ నెలలో బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో డబ్బులు లేవు కాబట్టి ప్రజలు సహించారు. అయితే, డిసెంబర్ మొదటి వారంలోనే తమ ఖాతాల్లో జీతం, పెన్షన్ డబ్బులు వచ్చినా తీసుకునే అవకాశం లేకపోవటంతో ప్రజలు రాష్ట్రంలోని అన్నీ బ్యాంకుల పైనా మండిపడుతున్నారు. మరి కొద్ది రోజుల్లో పరిస్ధితి చేయిదాటిపోయినా ఆశ్చర్యం లేదు.

ఆర్బఐ లెక్కల ప్రకారం రాష్ట్రానికి రూ. 20 వేల కోట్లు వస్తే, ప్రభుత్వ లెక్కల ప్రకారం వచ్చింది రూ. 11 వేల కోట్లే. దాంతో మిగిలిన రూ. 9 వేల కోట్లు ఎటువెళ్ళయన్నది పెద్ద ప్రశ్న. సామాన్య జనాలకేమో 2 వేల నోటు అందటమే గగనంగా మారుతోంది.

కానీ బడాబాబులకు మాత్రం కోట్ల కొద్దీ కొత్త నోట్ల కట్టలు అందుతుండటంతో ప్రజల్లో కూడా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.