అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాజకీయం వేడెక్కింది. మంత్రి ఉషశ్రీ చరణ్, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాజకీయం వేడెక్కింది. మంత్రి ఉషశ్రీ చరణ్, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి భూ కబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి ఉషశ్రీ చరణ్ ఖండించారు. తన ఆస్తులు పెరిగాయని చెబుతున్న నేతలు దమ్ముంటే నిరూపించాలని.. తన ఆస్తులు ఎంతో , టీడీపీ నేతల ఆస్తులు ఎంతో చర్చకు సిద్ధమా? అని కొద్ది రోజుల కిందట మంత్రి ఉషశ్రీ చరణ్ సవాలు విసిరారు.
ఇదిలా ఉంటే.. మంత్రి ఉషశ్రీ చరణ్ అక్రమాలకు సంబంధించిన ఆధారాలు బయట పెడతానని హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరి ఇటీవల ప్రకటించారు. టీ సర్కిల్ వద్ద శుక్రవారం బహిరంగ చర్చకు సిద్దమా? అంటూ సవాలు విసిరారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని పలు ప్రాంతాలో పోలీసులను మోహరించారు. అలాగే పలువురికి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అందించారు. ఈరోజు ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన హనుమంతరాయ చౌదరిని పోలీసులు అనుసరించారు. హనుమంతరాయ చౌదరి నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.
