శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉద్రిక్తత చోటు చేసుకొంది.పెన్షన్ల జాబితాలో అనర్హులకు చోటు కల్పించారని , టీడీపీకి చెందిన వారిని జాబితా నుండి తొలగించారని ఆరోపిస్తూ టెక్కలి మండలం చాకిపల్లి మాజీ ఎంపీటీసీ వసంత్ వలంటీర్ పై చేయిచేసుకొన్నాడు.దీంతో పోలీసులు వసంత్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలను మంగళవారం నాడు రాత్రి అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

టెక్కలి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన వారి పేర్లను పెన్షన్ జాబితా నుండి తొలగించారని టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసి వసంత్ ఆరోపించారు. పెన్షన్ జాబితా నుండి పేరు తొలగించడంపై ఆగ్రహంతో వలంటీర్ పై టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకొన్నారు.

వలంటీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు వసంత్ తో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు టెక్కలి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సమయంలో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.

టీడీపీ కార్యకర్తలకు మద్దతుగా టీడీపీ శాసనసభపక్ష ఉప నాయకుడు అచ్చెన్నాయుడు పోలీస్ స్టేషన్ లోనే గాంధీ చిత్రపటంతో నిరసనకు దిగారు. బుధవారం నాడు తెల్లవారుజామున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు ఆయన స్వగ్రామంలో వదిలివెళ్లారు.