ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీలు నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పలు జిల్లాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడకు బయలుదేరారు. దీంతో పోలీసులు జిల్లాల్లోనే అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో వారిని అడ్డుకుని విజయవాడ వెళ్లకుండా చూస్తున్నారు. 

అలాగే పలువురు నాయకులకు నోటీసులు అందజేశారు. ఆందోళనలకు అనుమతి లేనందున చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఇప్పటికే పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వారంతా ఒక్కసారిగా ధర్నా చౌక్‌ వైపు దూసుకువచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా చౌక్ వైపు వస్తున్న నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ధర్నా చౌక్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. 

ఇక, ఏపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు, బిల్లలు సక్రమంగా చెల్లించడం లేదని మండిపడుతున్నారు. తమకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని.. లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.