మిగిలిన ఫిరాయింపుదారుల నియోజకవర్గాలతో పోల్చుకుంటే అద్దంకి నియోజకవర్గంలో పరిస్ధితి చక్కదిద్దలేని స్ధితికి చేరుకుంది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చాలని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇద్దరూ వినటం లేదు.
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం టిడిపిలో ముసలం పుట్టింది. నియోజకవర్గంలో టిడిపి సీనీయర్ నేత కరణం బలరాం-వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘర్ణణలో ఇద్దరు మరణించారు. మరణించిన ఇద్దరూ కరణం మద్దతుదారులు కావటంతో నియోజకవర్గంలో తీవ్రఉద్రిక్తత మొదలైంది. పాతకక్షలను మనసులో పెట్టుకుని గొట్టిపాటి వర్గీయులు కరణం మనుషులపై హటాత్తుగా కర్రలు, కత్తులతో దాడులు చేసి ఆరుగురిని గాయపరిచారు. దాడిలో రామకోటేశ్వరరావు, అంజయ్యలు మరణించగా, మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘర్షణలకు గ్రానైట్ కు సంబంధించిన వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. వైసీపీ నుండి గొట్టిపాటిరవి టిడిపిలో చేరటం కరణంకు ఏమాత్రం ఇష్టం లేదు. అదే విషయాన్ని చంద్రబాబుతోచెప్పినా వినలేదు. పైగా టిడిపిలో చేరిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గొట్టిపాటిదే హవా కొనసాగుతోంది. దాన్ని కరణం సహించలేకపోయారు. అదే విషయాన్ని పలుమార్లు చంద్రబాబు వద్ద చెప్పుకున్నా ఉపయోగం కనబడలేదు. దాంతో నియోజకవర్గంలో రెండు వర్గాలకు చిన్నపాటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతీసారి పోలీసులు జోక్యం చేసుకుని సర్దబాటు చేస్తూనే ఉన్నారు.
అయితే, చిన్న చిన్న ఘర్షణలే పెరిగి పెద్దవైపోయాయి. దానికితోడు గొట్టిపాటికి ఉన్న గ్రానైట్ క్వారీ రెండేళ్ళ క్రితం మూతపడింది. తన క్వారీ మూతపడటానికి కరణం మద్దతుదారులే కారణమంటూ గొట్టిపాటి గుర్రుగా ఉంటున్నారు. తన క్వారీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసును కోర్టులో వాపసు తీసుకోమని హెచ్చరించినా కరణం మద్దతుదారులు వినిపించుకోలేదు. అది మనసులో పెట్టుకుని శుక్రవారం అర్ధరాత్రి ఒక వివాహం నుండి మోటారు బైకులపై తిరిగి వస్తుండగా దారికాచి దాడి చేసారు.
దాంతో గొట్టిపాటి, కరణం గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతేకాకుండా నియోజకవర్గంలో కూడా 144 సెక్షన్ పెట్టారు. పోలీసు అదనపు బలగాలు కూడా వచ్చాయి. దాంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని పార్టీలోని నేతలు, జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. మిగిలిన ఫిరాయింపుదారుల నియోజకవర్గాలతో పోల్చుకుంటే అద్దంకి నియోజకవర్గంలో పరిస్ధితి చక్కదిద్దలేని స్ధితికి చేరుకుంది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చాలని చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇద్దరూ వినటం లేదు. ఓ వైపు ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇంకోవైపు నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు సృతిమించుతున్నాయి. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.
