కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర, ప్రత్యేకహోదా డిమాండ్ కు పదన్, జగన్ మద్దతుతో విశాఖపట్నం కేంద్రంగా ఉద్యమ వేడి చంద్రబాబును చుట్టుముట్టాయి.
దావోస్ వెళ్ళి వచ్చిన ఆనందం కూడా చంద్రబాబునాయుడులో మిగలలేదు. దావోస్ నుండి రాష్ట్రానికి వచ్చేటప్పటికి సమస్యలు ముసురుకున్నాయి. కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర, ప్రత్యేకహోదా డిమాండ్ కు పదన్, జగన్ మద్దతుతో విశాఖపట్నం కేంద్రంగా ఉద్యమ వేడి చంద్రబాబును చుట్టుముట్టాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, ముద్రగడైనా, పవన్ కల్యాణ్ అయినా కాపు సామాజికవర్గంలో ప్రముఖులే. ఇపుడు ఇద్దరూ చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. విచిత్రమేమిటంటే రెండు డిమాండ్లు నెరవేరటం కూడా చంద్రబాబు చేతిలో లేవు.
కాపులకు రిజర్వేషన్లంటూ స్వయంగా చంద్రబాబే ఆచరణసాధ్యం కాని హమీ ఇచ్చి ఇరుక్కున్నారు. ఇంకోటేమో ప్రధానమంత్రి నరేంద్రమోడి చేత ప్రత్యేకహోదా ఇప్పించడం చేతకాక అవస్తలు పడుతున్నారు. ఎప్పుడైతే ‘ఓటుకునోటు’ కేసులో ఇరుక్కుని బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారో అప్పుడే కేంద్రాన్ని డిమాండ్ చేసే శక్తి కోల్పోయారు. దానిపైన పోలవరం ప్రాజెక్టు అదనం. దాంతో చంద్రబాబును మోడి ఏ దశలోనూ లెక్క చేయటం లేదు. అయినా కిక్కురుమనటం లేదు. కారణం, రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం తనను ముప్పుతిప్పలు పెడుతుండమే.
ముద్రగడ పాదయాత్ర, ప్రత్యేకహోదా ఉద్యమం ఒకేసారి తెరపైకి వచ్చాయి. దాంతో చంద్రబాబుకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాత్రి ముద్రగడను అరెస్టు చేయటంతో ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్ధితి ఉద్రిక్తంగా మారాయి. గురువారం విశాఖలో మొదలవ్వనున్న ఉద్యమం విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. ఉద్యమానికి వైసీపీ మద్దతు ప్రకటించి రాష్ట్రం నలుమూలల నుండి కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరిస్తోంది. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది.
ఈనెలాఖరులో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖ కేంద్రంగా మూడు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. సరిగ్గా రెండు రోజుల ముందు విశాఖ కేంద్రంగా ‘ప్రత్యేక’ రాజకీయం షురూ అయింది. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. గురువారం ఉద్యమ స్వరూపాన్ని బట్టి భాగస్వామ్య సదస్సు నిర్వహణ ఆధారపడి ఉంది. సదస్సు నిర్వహణ వల్ల రాష్ట్రానికి కోట్లాది రూపాయల చేతిచమురు వదలటం తప్ప ఏమీ ఉపయోగం లేకపోయినా సదస్సు సదస్సే కదా?
