ముగ్గురు ఫిరాయింపు ఎంపిల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయ్. ఎప్పుడైతే కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించిందో వారిలో ఆందోళన మొదలైంది. శుక్రవారం హటాత్తుగా మలుపు తిరిగిన రాజకీయ పరిణామాల్లో టిడిపి కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వటంతో వారిలో ఆందోళన తీవ్రస్ధాయికి చేరుకున్నది.

వైసిపి తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, కొత్తా గీత టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి రెడ్డి, రేణుక టిడిపిలోనే ఉన్నా, గీత మాత్రం ఏ పార్టీలో ఉన్నారో ఆమెకే తెలీదేమో? సరే, ఎవరు ఏ పార్టీలో ఉన్నా అవిశ్వాస తీర్మానాల వల్ల ముగ్గురూ  బాగా ఇరుక్కుపోయారు.

ఎటు ఓటు వేసినా, ఓటింగ్ నుండి గైర్హాజరైనా చివరకు పోయేది వారి సభ్యత్వమే అన్న విషయం స్పష్టమైపోయింది. ఎందుకంటే, అవిశ్వాస తీర్మానం ప్రకారం కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ తన ఎంపిలకు వైసిపి విప్ జారీ చేసింది. విప్ ను ఉల్లంఘిస్తే సభ్వత్వం పోవటం ఖాయం. అలాగని ఓటింగ్ కు గైర్హాజరయ్యేందుకూ లేదు.

ఓటింగ్ విషయంలో ఏం చేయాలో ఫిరాయింపు ఎంపిలకు అర్ధం కావటం లేదు. తమ సమస్యను చంద్రబాబునాయుడుకే వదిలేస్తే అంతా ఆయనే చూసుకుంటారు లేమనుకున్నారు. అయితే  చివరినిముషంలో ఎన్డీఏకి గుడ్ బై చెప్పేసిన చంద్రబాబు చివరి నిముషంలో తాను కూడా కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంతో ముగ్గురు ఫిరాయింపులు ఇరుక్కుపోయారు.

ప్రస్తుతం ఫిరాయింపు ఎంపిల పరిస్దితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ లాగ తయారైంది. దాంతో అసలు అవిశ్వాస తీర్మానం చర్చకు రాకూడదని, ఓటింగ్ జరగకూడదని దేవుడికి వెయ్యి దణ్ణాలు పెట్టుకుంటున్నారట. మరి ఫిరాయింపుల సభ్యత్వాలు నిలవాలంటే వారిని దేవుడే కాపాడాలి.