తెనాలి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తెనాలి నియోజకవర్గానికి విభిన్నమైన గుర్తింపు వుంది. ఇక్కడ టిడిపి, కాంగ్రెస్, వైసిపిలే కాదు జనతా పార్టీ కూడా గెలిచిన చరిత్ర వుంది. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్యది కూడా ఈ నియోజకవర్గమే. ప్రస్తుతం భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ టిడిపి-జనసేన కూటమి నుండి పోటీ చేస్తున్నారు. 

తెనాలి రాజకీయాలు : 

తెనాలి రాజకీయాల్లో ఆలపాటి కుటుంబానిదే చాలాకాలం పైచేయిగా నిలిచింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఆలపాటి వెంకటరామయ్య వరుసగా 1952 నుండి 1965 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన కూతురు దొడ్డపనేని ఇందిర మూడుసార్లు, మనవరాలు గోగినేని ఉమ ఓసారి ఎమ్మెల్యేగా పనిచేసారు. ఈ ముగ్గురు వేరువేరు పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఇక నాదెండ్ల, అన్నాబత్తుని కుటుంబాలు కూడా తెనాలి రాజకీయాలను శాసిస్తున్నారు. ఈ మూడు కుటుంబాలకు చెందినవారే ఇప్పటివరకు తెనాలి ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 

తెనాలి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :

1. తెనాలి 

2. కొల్లిపర 

తెనాలి అసెంబ్లీ ఓటర్లు : 

తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,63,286 (2019 ఎన్నికల ప్రకారం). వీరిలో పురుషులు 1,27,775, మహిళలు 1,35,465 వున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నవారు 2,03,175 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన పురుషులు - 103959 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన మహిళలు 99,213

తెనాలి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

టిడిపి‌-జనసేన కూటమి అభ్యర్థి :

టిడిపి-జనసేన కూటమి నుండి తెనాలి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగారు. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఈ సీటును ఆశించి చాలా ప్రయత్నాలు చేసారు. కానీ జనసేనలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న నాదెండ్లకు ఈ సీటును కేటాయించక తప్పలేదు. 

వైసిపి అభ్యర్థి :

ప్రస్తుతం తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్ కొనసాగుతున్నారు. ఆయితే ఆయనకే మళ్లీ వైసిపి నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు తెనాలి అభ్యర్థిని వైసిపి ప్రకటించలేదు. 

తెనాలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : 

తెనాలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో మొత్తం 2,05,768 మంది ఓటేసారు. అంటే 78 శాతం పోలింగ్ నమోదయ్యింది. 

వైసిపి - అన్నాబత్తుని శివకుమార్ - 94,495 (45 శాతం) ‌- గెలుపు (17,649 వేల ఓట్ల మెజారిటీతో)

టిడిపి - ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ - 76,846 (37 శాతం) - ఓటమి 

జనసేన - నాదెండ్ల మనోహర్ - 29,905 ‌(14 శాతం) - మూడో స్థానం 


తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు 2014 : 

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో టిడిపి హవా కొనసాగింది. దీంతో 2014 ఎన్నికల్లో తెనాలి టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 93,524 (48 శాతం) ఓట్లు సాధించి విజయం సాధించాడు. వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు 74,459 (38 శాతం) ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైసిపిపై టిడిపి మెజారిటీ 19,065. తెనాలి నుండి విజయం సాధించిన ఆలపాటికి టిడిపి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది.